
హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటన.. 151కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్‌లోని ఏడు బహుళ అంతస్తుల భవనాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగించగా, మరో ఐదు మృతదేహాలు లభ్యం కావడంతో ఈ సంఖ్య పెరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికీ 104 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ అగ్నిప్రమాదం బుధవారం మధ్యాహ్నం తై పో శివారు ప్రాంతంలోని వాంగ్ ఫుక్ కోర్ట్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో సంభవించిన విషయం తెలిసిందే. మొత్తం ఎనిమిది అపార్ట్‌మెంట్ టవర్లలో ఏడింటిని మంటలు దహించివేశాయి. దాదాపు 4,600 మంది ఇక్కడ నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. మృతుల సంఖ్య 151కి చేరగా, 79 మంది గాయపడ్డారు. విపత్తు నిర్వహణ సిబ్బంది ఈ వారాంతంలో నాలుగు భవనాలలో గాలించి, మొత్తం మృతదేహాలను వెలికితీశారు.
భారీగా విరాళాలు
ఈ ఘోర ప్రమాదంతో బాధిత కుటుంబాలకు మద్దతుగా హాంకాంగ్ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అగ్నిప్రమాద బాధితుల కోసం సేకరించిన విరాళాల మొత్తం 900 మిలియన్ హాంకాంగ్ డాలర్లకు (సుమారు 115 మిలియన్ డాలర్లు) చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం కూడా 300 మిలియన్ హాంకాంగ్ డాలర్లను (సుమారు 38.5 మిలియన్ డాలర్లు) ప్రకటించింది. ఈ నిధులను బాధితుల ఇళ్లను పునర్నిర్మించడానికి, దీర్ఘకాలిక సహాయం అందించడానికి ఉపయోగిస్తారు. కాగా ఇప్పటివరకు 683 మంది స్థానిక హోటళ్లు, హాస్టళ్లలో ఆశ్రయం పొందుతుండగా, మరో 1,144 మంది తాత్కాలిక గృహాలకు తరలివెళ్లారు.
భద్రతా లోపాలపై అనుమానాలు
అగ్నిప్రమాదానికి కారణం, ఈ స్థాయిలో నష్టం జరగడానికి గల కారణాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భవనాలకు బయట పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. భవనం మొత్తం వెదురు పరంజాలతో కప్పబడి, నైలాన్ వలలు వేలాడుతున్నాయి. కిటికీలు కూడా పాలిస్టైరీన్ ప్యానెళ్లతో కప్పబడ్డాయి. అగ్నిమాపక నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ డైరెక్టర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్‌తో సహా 11 మందిని హాంగ్ కాంగ్ అవినీతి నిరోధక సంస్థ అరెస్టు చేసింది. ప్రభుత్వ అధికారుల బాధ్యతపైనా ప్రశ్నలు పెరుగుతున్నాయి.
ప్రజల్లో పెరుగుతున్న విమర్శలను అణచివేయడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుతూ ఆన్‌లైన్‌లో పిటిషన్ వేయడానికి సహాయం చేసిన వ్యక్తిని రాజద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చిన ఒక స్వచ్ఛంద సేవకుడితో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. విపత్తును అడ్డం పెట్టుకుని "తొందర పెట్టాలని, హాంకాంగ్‌కు ఆటంకం కలిగించాలని" చూస్తున్నారని జాతీయ భద్రతా కార్యాలయం తీవ్రంగా హెచ్చరించింది.
హాంకాంగ్ అధికారులు, మెయిన్‌ల్యాండ్ చైనా అధికారుల మాదిరిగానే నిరసనలు మొదలవకముందే వాటిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ అరెస్టులపై హాంకాంగ్ పోలీసులు నిర్దిష్టంగా వ్యాఖ్యానించడానికి నిరాకరించి, "పరిస్థితులకు అనుగుణంగా మరియు చట్టానికి అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు" అని మాత్రమే తెలిపారు. కాగా ఈ అగ్నిప్రమాదం, దాని అనంతర పరిణామాలు హాంకాంగ్‌లో భద్రతా నిబంధనల లోపాలను, రాజకీయ స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలను మరోసారి స్పష్టం చేశాయి.
