
హాంకాంగ్ అగ్నిప్రమాదం: 128కి చేరిన మృతుల సంఖ్య, 8 మంది అరెస్టు
హాంకాంగ్‌లోని బహుళ అంతస్తుల భవనాల్లో బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. సుమారు 200 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాదం 1983లో నిర్మించిన ఎత్తైన అపార్ట్‌మెంట్ టవర్‌లో చెలరేగింది. భవనం చుట్టూ ఏర్పాటు చేసిన పరంజాలు, అగ్ని నిరోధక ప్రమాణాలకు అనుగుణంగా లేని నిర్మాణ వస్తువులు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయి.
అవినీతి ఆరోపణలు, 8 మంది అరెస్టు
తై పో ప్రాంతంలో జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం వెనుక రూ.330 కోట్ల విలువైన పునరుద్ధరణ (అప్‌గ్రేడ్) పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ అవినీతి నిరోధక సంస్థ (ఐసీఏసీ) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పునరుద్ధరణ ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో ఏడుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిలో పరంజా సబ్‌కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ కంపెనీ డైరెక్టర్లు, పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్‌లు ఉన్నారు. ఈ అవినీతి దర్యాప్తును ఐసీఏసీ గురువారం నాడు ప్రమాదం జరిగిన వెంటనే ప్రారంభించింది. శుక్రవారం అరెస్టులతో పాటు, ఏజెన్సీ ఈ అనుమానితుల కార్యాలయాలలో సోదాలు చేసి, ముఖ్యమైన పత్రాలు, బ్యాంక్ రికార్డులను స్వాధీనం చేసుకుంది.
ఈ అపార్ట్‌మెంట్‌లలో నివసించే నివాసితులు చాలా కాలంగా నిర్మాణ పనుల్లో నాసిరకం పనితనంపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి పాత పబ్లిక్ హౌసింగ్ భవనాలలో భద్రతా ప్రమాణాలపై కొత్త నియమాలను సమీక్షించాలని నిర్ణయించారు.
