Let's talk: editor@tmv.in
హాంకాంగ్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మందికి పైగా మృతి

హాంకాంగ్‌‌‌లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మందికి పైగా మృతి

Shaik Mohammad Shaffee
27 నవంబర్, 2025

హాంకాంగ్‌లోని ఓ నివాస సముదాయంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించినట్లు నగర అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఈ అగ్నిప్రమాదం బహుళ ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాలకు వ్యాపించడంతో తీవ్ర విషాదం నెలకొంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సంఘటనా స్థలంలోనే మరణించినట్లు ధృవీకరించగా, ఆసుపత్రికి తరలించిన మరో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ భీకర అగ్నిప్రమాదం నుంచి సుమారు 700 మంది నివాసితులను సురక్షితంగా తరలించి, తాత్కాలిక శిబిరాలకు తరలించారు.

బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మంటలు రాత్రి కావడంతో మరింత తీవ్రమయ్యాయి. దీంతో అధికారులు ప్రమాద తీవ్రతను అత్యధిక స్థాయి అయిన లెవెల్ 5 అలారంగా ప్రకటించారు. న్యూ టెర్రిటరీస్‌లోని తై పో జిల్లాలో ఉన్న ఈ నివాస సముదాయం వెలుపల నిర్మాణ పనులు, మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన వెదురు పరంజాలు, నిర్మాణ వలల ద్వారా మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాద స్థలం నుండి విడుదలైన వీడియోల్లో ఒకదానికొకటి దగ్గరగా ఉన్న కనీసం ఐదు భవనాలకు మంటలు అంటుకున్న దృశ్యాలు కనిపించాయి. రాత్రి చీకటి పడే సమయంలో అపార్ట్‌మెంట్ కిటికీల నుండి దట్టమైన పొగతో పాటు అగ్ని కీలలు పెద్దఎత్తున వెలువడ్డాయి.

తైపో జిల్లా కౌన్సిల్ సభ్యుడు, లో హియు ఫంగ్ స్థానిక టీవీ ఛానెల్ టీవీబీతో మాట్లాడుతూ, మంటల్లో చిక్కుకున్న నివాసితుల్లో వృద్ధులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా వృద్ధులు, ఇతర నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. హాంకాంగ్‌లో నిర్మాణ, మరమ్మత్తు పనుల కోసం వెదురు పరంజాలను ఉపయోగించడం సర్వసాధారణం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ ప్రాజెక్టుల నుండి వాటిని క్రమంగా తొలగించాలని ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటించింది.