Let's talk: editor@tmv.in
హస్త కళలను కాపాడుకోవాలి!

హస్త కళలను కాపాడుకోవాలి!

FL - SUNL
28 సెప్టెంబర్, 2025

దేశ సంస్కృతిలో భాగమైన 'హస్త కళలు' కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలని సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక "బెరంపార్కు"లో శనివారం జరిగిన హస్త కళాకారుల ఒకరోజు వర్క్ షాప్‌ను జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ఆయన ప్రారంభించారు. "అపిటికో", రాష్ట్ర హస్త కళాకారుల సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్క్ షాప్‌లో ఆయ‌న‌ మాట్లాడారు. భిన్న మతాలు, జాతులు, తెగలు, సంస్కృతుల మధ్య దేశంలో కొనసాగుతున్న 'ఏకత్వాన్నిస‌, హస్తకళారూపాలు, నాట్య, సంగీత, సాహిత్యాలు దోహదపడతాయని ఆయన అన్నారు. ముందు తరాలనుంచి మీకందిన హస్త కళల వారసత్వాన్ని తరువాతి తరాలు అందిపుచ్చుకునేలా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని హస్త కళాకారులకు ఆయన సూచించారు.

పిల్లల భవిత ఉజ్వలంగా ఉండాలని కోరుకోవడం సహజమే అయినప్పటికీ, మన కళల వారసత్వాన్నివారు అందిపుచ్చుకొని, ఆర్ధికంగా స్థిరపడేలా వృత్తి నైపుణ్యాలను, వ్యాపార ధోరణులను నేర్చుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుత అధునాతన వాణిజ్య పోకడలతో తమ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరారు. మన హస్త కళాకృతులు "అమెజాన్" వంటి సంస్థల సహకారంతో దేశ, విదేశాల్లో ప్రఖ్యాతమవ్వాలని ఆయన ఆకాంక్షించారు. అందుకు తగిన శిక్షణ, మార్గదర్శకత్వం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించడంలో భాగంగా ఇటువంటి వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రొఫెస‌ర్‌ ఆదినారాయణ నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాలపై హస్త కళాకారులకు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హస్త కళల అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ సుధీర్ కుమార్, సీఆర్‌ మీడియా అకాడెమీ మేనేజర్ భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

హస్త కళలను కాపాడుకోవాలి! - Tholi Paluku