Let's talk: editor@tmv.in
హస్తకళలకు పుట్టినిల్లు - పెంబర్తి

హస్తకళలకు పుట్టినిల్లు - పెంబర్తి

Dantu Vijaya Lakshmi Prasanna
6 డిసెంబర్, 2025

హస్తకళలకు ఆదరణ కరువైంది. చేనేత కార్మికులు పూటగడవక ఉసురుతీసుకుంటున్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ లో ఇంకా హస్తకళలకు గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. ఇక భారతదేశం ఎన్నో హస్తకళలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ తయారైన వస్తువులకు ప్రపంచమార్కెట్ లో మంచి గుర్తింపు ఉంది. కానీ వాటికి తగిన మార్కెట్ , ప్రచారం కల్పించడంలో ప్రభుత్వాలు కూడా ఆశించిన స్థాయిలో చొరవ చూపడం లేదు. అటువంటి అరుదైన హస్తకళల కేంద్రం వరంగల్ జిల్లా జనగామ మండలంలోని పెంబర్తి. ఇక్కడ తయారైన ఇత్తడి, రాగి వస్తువులు.. వాటిలోని కళాత్మక శైలికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే ఈ ప్రాంతం పేరు ప్రపంచమార్కెట్ లో మారిమోగుతున్నది. అటువంటి అరుదైన పర్యాటక క్షేత్రం పెంబర్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

పెంబర్తి: బెస్ట్ టూరిజం విలేజ్

వరంగల్ జిల్లా జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం హస్తకళలకు పుట్టినిల్లుగా ఉంది. ఇక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ గ్రామం ముఖ్యంగా హస్తకళలు, మరీ ముఖ్యంగా ఇత్తడి, కాంస్య వస్తువులకు ప్రసిద్ధి చెందిన ఊరు. కాకతీయుల కాలంలో ఆరంభమైన ఈ హస్తకళలు ఇప్పటికీ జీవంతో ఉన్నాయి. ఈ గ్రామం 2023లో 'బెస్ట్ టూరిజం విలేజ్' అవార్డు గెలుచుకుంది, ఇది దాని పర్యాటక ప్రాముఖ్యతను సూచిస్తుంది.

చారిత్రక ప్రాముఖ్యత

పెంబర్తి హస్తకళలు 12 నుండి 14 శతాప్ధపు కాకతీయుల కాలంలో ప్రారంభమయ్యాయి. విశ్వకర్మలు అనే శిల్పులు దేవాలయాలకు విగ్రహాలు, వాహనాలు, ప్రభలు మొదలైనవి తయారు చేసేవారు. నిజాం కాలంలో వెండి, బంగారు వస్తువులకు మార్పు వచ్చింది.స్వాతంత్ర్యానంతరం ఇత్తడి వస్తువులపై దృష్టి పెరిగింది. 1958లో విశ్వకర్మ ఇత్తడి, రాగి,వెండి ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ స్థాపించబడింది, ఇది హస్తకళలను ఆధునికీకరించింది. ఈ చరిత్ర పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఎందుకంటే ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

సాంస్కృతిక, హస్తకళల ప్రాముఖ్యత

పెంబర్తి ఇత్తడి హస్తకళలు జి.ఐ ట్యాగ్ (2010) పొందాయి. ఇది వాటి ప్రత్యేకతకు ఒక గుర్తింపు. ఇక్కడ తయారయ్యే వస్తువులు, ద్వజస్తంభం కవర్లు, పూజా సామగ్రి, విగ్రహాలు, స్మారక చిహ్నాలు మొదలైనవి. ఈ గ్రామంలో 50 కుటుంబాలు హస్తకళలపై ఆధారపడి ఉన్నాయి.మహిళలు కూడా శిక్షణ పొంది వీటి తయారీలో పాల్గొంటున్నారు. సాంస్కృతికంగా, ఇది సాంప్రదాయ శిల్పకళలను కాపాడుతుంది,పర్యాటకులకు ప్రత్యక్ష వీక్షణకు పర్యటన అనువుగా వుంటుంది. హరిత హారం పథకం కింద 30,000 చెట్లు నాటడం, “సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం” వంటి పర్యావరణ చర్యలు కూడా సాంస్కృతిక సుస్థిరతను ప్రోత్సహిస్తున్నాయి..

పర్యాటక ఆకర్షణలు, కార్యకలాపాలు

సంవత్సరానికి సుమారు 25,000 మంది పర్యాటకులు వస్తారు. సందర్శకులు హస్తకళలు కొనుగోలు, చేతివృత్తులవారితో మాట్లాడటం, తయారీ ప్రక్రియ చూడటం ప్రధాన ఆకర్షణలుగా బావిస్తారు.. సమీపంలోని కొలనుపాక జైన్ ఆలయం, నిడిగొండ త్రికూట ఆలయం, పాలకుర్తి ఆలయం, ఘన్‌పూర్ రెడ్డి గుడి, జఫర్‌గఢ్ కోట మొదలైనవి చూడదగ్గ ప్రత్యేక ప్రాంతాలు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సందర్శనకు అనువైన సమయం.ఈ ప్రాంతం గ్రామీణ పర్యాటక ప్రణాళిక పనిలో భాగంగా అభివృద్ధి చేయబడుతుంది..

ఆర్థిక ప్రాముఖ్యత

హస్తకళలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. వీరి ఉత్పత్తులు అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్‌లకు ఎగుమతి అవుతాయి. పర్యాటకం ద్వారా ఆదాయం పెరుగుతుంది, ఎగ్జిబిషన్‌లు, అమ్మకాలని ప్రోత్సాహిస్తాయి. తెలంగాణ పర్యాటక విధానం 2025 నుండి 2030 కింద మౌలిక సదుపాయాల అభివృద్ధి, సురక్షిత పర్యాటక ప్రోత్సహం ఉన్నాయి. వరంగల్ పర్యాటకంలో పెంబర్తి భాగమై, MICE టూరిజం (మీటింగ్స్, ఇన్‌సెంటివ్స్, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్‌లు)కు అవకాశాలు సృష్టిస్తుంది.

రవాణా, మౌలిక సదుపాయాలు

హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి 163 పై ఉండటం వల్ల సులభంగా చేరుకోవచ్చు. సమీప ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రైల్వే స్టేషన్ ఉంది. హైదరాబాద్, వరంగల్ నుంచి అనుసంధానం

సులభతరం. ప్రస్తుతం మౌలిక సదుపాయాలు, సౌర దీపాలు, స్వస్థలాలు, పర్యాటక సమాచార కేంద్రాలు అభివృద్ధి చేయబడుతున్నాయి.

సవాళ్లు ,అవకాశాలు

సవాళ్లు:

శిల్పులకు తక్కువ వేతనాలు, పోటీ, భద్రతా సమస్యలు, గైడ్‌ల లేమి, దూరప్రసారం సమస్యలుగా పరిణమిస్తున్నాయి. అభివృద్ధి చెందని మౌలిక సదుపాయాల కారణంగా పూర్తి సామర్థ్యం ఉపయోగించబడటం లేదు. గ్రామీణ పర్యాటక ప్రోత్సాహం, పర్యావరణ పర్యాటకం, ఎగుమతులు పెంచడం. ప్రభుత్వ విధానాలు (2025 నుండి 2030) మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధికి సహాయం చేస్తున్నాయి

బలాలు: సాంస్కృతిక వారసత్వం

బలహీనతలు: క్రయవిక్రయాల లేమి

అవకాశాలు: పర్యాటక ప్రచారం, ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్

సమస్యలు: ఆధునిక పోటీ.

మొత్తంగా, పెంబర్తి వరంగల్ జిల్లా పర్యాటకంలో కీలక పాత్ర పోషిస్తుంది, హస్తకళలు, సాంస్కృతిక వారసత్వం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రభుత్వ సహాయంతో మరిన్ని అభివృద్ధి అవకాశాలు కలుగుతున్నాయి.