Let's talk: editor@tmv.in
హర్యానా మా సోదర రాష్ట్రం: పంజాబ్ సీఎం

హర్యానా మా సోదర రాష్ట్రం: పంజాబ్ సీఎం

Pinjari Chand
28 జనవరి, 2026

ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సట్లెజ్‌–యమునా లింక్‌ (ఎస్‌వైఎల్‌) కాలువ వివాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, హర్యానా ముఖ్యమంత్రి నయబ్‌ సింగ్‌ సైనీ మంగళవారం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అధికారులు ఈ అంశంపై పరస్పరం చర్చించి పురోగతిపై సీఎంలకు నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో గంటకు పైగా సాగిన ఈ సమావేశం అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ హర్యానా పంజాబ్‌కు శత్రువు కాదు. అది మా సోదర రాష్ట్రం. ఎవరి హక్కులు దెబ్బతినకుండా పరిష్కారం రావాలి. పంజాబ్‌ హక్కులు దెబ్బతినకూడదు, అలాగే హర్యానా హక్కులు కూడా దెబ్బతినకూడదని స్పష్టం చేశారు. ఎస్‌వైఎల్‌ కాలువ అంశం అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాస్పదంగా కొనసాగుతోంది. గత ఏడాది మే నెలలో ఈ వివాదంపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్నేహపూర్వక పరిష్కారం కోసం సహకరించాలని పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ఇటీవల ఏప్రిల్‌లో విచారణకు లిస్టు చేసింది.

ప్రతి విషయానికి ప్రత్యేక సమావేశం అవసరం లేదు

మీడియాతో మాట్లాడిన హర్యానా సీఎం నయబ్‌ సింగ్‌ సైనీ చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయి. మంచి వాతావరణంలో జరిగే చర్చలు ఫలప్రదమైన ఫలితాలను ఇస్తాయి. ఈ సమావేశం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే జరిగిందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన కూడా ఈ అంశంపై సమావేశం జరిగిందని, అందులోనూ సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని సైనీ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల అధికారులు తరచుగా సమావేశాలు నిర్వహించి, చర్చల్లో తలెత్తే అంశాలను సీఎంల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. అధికారుల సమావేశాల తర్వాత అవసరమైతే ఇద్దరు సీఎంలు ఫోన్‌లోనూ చర్చలు జరుపుతారని, ప్రతి విషయానికీ ప్రత్యేక సమావేశం అవసరం లేదని అన్నారు.

సమస్యను పరిష్కరించుకోవాలి

భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతోందని, గురువుల బోధనలు తమకు మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. యుద్ధంలో కూడా శత్రువులకు నీళ్లు అందించిన భాయ్‌ కన్హయ్య వారసులం మేం. హర్యానా మాకు శత్రువు కాదు, సోదరుడు అని వ్యాఖ్యానించారు. నీటి సమస్య భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారబోతోందని మాన్‌ తెలిపారు. సమావేశంలో తాను తన వాదనను, హర్యానా సీఎం తన వాదనను స్పష్టంగా తెలిపారని చెప్పారు. ఇది పెద్దల కాలం నాటి గొడవ. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. సమస్య పరిష్కారం కావాలి, అది జరిగితే మంచిదే అని సరదాగా వ్యాఖ్యానించారు.

ఎస్‌వైఎల్‌ కాలువ నిర్మాణంపై ప్రశ్నించగా, మాన్‌ స్పందిస్తూ కాలువలో వదలడానికి నీళ్లే లేకపోతే ఏం వదులుతాం? జ్యూస్‌నా? అంటూ వ్యాఖ్యానించారు. ముందుగా నీటి లభ్యతపై తిరిగి సమీక్ష అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంజాబ్‌ జల వనరుల మంత్రి బరీందర్‌ కుమార్‌ గోయల్‌, హర్యానా నీటిపారుదల మంత్రి శ్రుతి చౌదరి, పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీ కేఏపీ సిన్హా, హర్యానా సీఎం ప్రధాన కార్యదర్శి రాజేశ్‌ ఖుల్లర్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్‌వైఎల్‌ కాలువ ప్రాజెక్టు రవి, బియాస్‌ నదుల జలాలను పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల మధ్య సమర్థవంతంగా పంచుకునేందుకు రూపకల్పన చేశారు. మొత్తం 214 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువలో 92 కిలోమీటర్లు హర్యానా పరిధిలో, 122 కిలోమీటర్లు పంజాబ్‌ పరిధిలో నిర్మించాల్సి ఉంది. హర్యానా తన పరిధిలో పనులను పూర్తి చేయగా, పంజాబ్‌ మాత్రం 1982లో ప్రారంభించిన పనులను నిలిపివేసింది.

ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న జల వివాదం.. పూర్తయితే కలిగే ప్రయోజనం

సట్లెజ్‌–యమునా లింక్‌ (ఎస్‌వైఎల్‌) కాలువ ప్రాజెక్టు పూర్తయితే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు వ్యవసాయం, నీటి పంపిణీ, ఆర్థిక వ్యవస్థ పరంగా కీలక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే నీటి లభ్యత, రాష్ట్రాల మధ్య న్యాయ వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు దాదాపు ఆరు దశాబ్దాలుగా వివాదాస్పదంగానే కొనసాగుతోంది.

హర్యానాకు కలిగే ప్రయోజనాలు

ఎస్‌వైఎల్‌ కాలువ పూర్తయితే హర్యానాకు రవి–బియాస్ నదుల నుంచి కేటాయించిన నీరు అందుబాటులోకి వస్తుంది. దక్షిణ హర్యానాలోని మహేంద్రగఢ్‌, రెవారీ, భివానీ వంటి ఎండాబారిన ప్రాంతాల్లో సాగునీటి సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గి నీటి మట్టం కాపాడటంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

పంజాబ్‌కు కలిగే లాభాలు

పంజాబ్‌కు సంబంధించి, నీటి పంపిణీపై కుదిరిన ఒప్పందాలు అమలులోకి రావడమే ప్రధాన లాభంగా ఉండనుంది. ఎస్‌వైఎల్‌ కాలువ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుతో సాగుతున్న న్యాయ వివాదాలకు ముగింపు పలికే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్తులో కొత్త నీటి వనరుల పథకాల కోసం కేంద్ర సహాయం పొందే మార్గం సుగమమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర వివాదం ముగియడం వల్ల రాజకీయ, పాలనా స్థిరత్వం పెరుగుతుందని అంచనా. అయితే పంజాబ్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోనే నీటి కొరత తీవ్రంగా ఉందని, కాలువలో వదిలేంత నీరు ప్రస్తుతం లభించడం లేదు అన్నదే తమ ప్రధాన అభ్యంతరమని స్పష్టం చేస్తోంది.

ఎస్‌వైఎల్‌ వివాదం – చరిత్ర

ఎస్‌వైఎల్‌ కాలువ సమస్యకు దాదాపు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది.

1966లో పంజాబ్‌ రాష్ట్రం విభజనకు గురై హర్యానా కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకంపై వివాదం మొదలైంది. 1976లో కేంద్ర ప్రభుత్వం రవి–బియాస్ నదీ జలాల పంపిణీపై నోటిఫికేషన్ జారీ చేసి హర్యానాకు నిర్దిష్ట వాటా కేటాయించింది.

1981లో పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య నీటి పంపక ఒప్పందం కుదిరి, ఎస్‌వైఎల్‌ కాలువ నిర్మాణానికి అంగీకారం లభించింది. 1982లో పంజాబ్‌లో కాలువ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, 1985లో రాజీవ్‌–లాంగోవాల్ ఒప్పందం తరువాత కూడా ప్రాజెక్టు పూర్తి కాలేదు. 1990ల తర్వాత భద్రతా, రాజకీయ కారణాలతో పనులు నిలిచిపోయాయి.

2004లో పంజాబ్ ప్రభుత్వం కాలువ నిర్మాణాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకురాగా, 2016లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసింది. 2023 నుంచి 2025 మధ్య కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచించాయి. తాజాగా 2026లో పంజాబ్‌, హర్యానా ముఖ్యమంత్రుల మధ్య మరోసారి చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్‌వైఎల్‌ కాలువ వివాదం 1966 నుంచే కొనసాగుతున్నప్పటికీ, ప్రాజెక్టు పూర్తయితే హర్యానాకు తక్షణ సాగునీటి లాభాలు, పంజాబ్‌కు న్యాయ–రాజకీయ పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే నీటి లభ్యతే ప్రధాన అడ్డంకిగా మారడంతో, కోర్టు, కేంద్రం సూచనల మేరకు ఇరు రాష్ట్రాలు ప్రస్తుతం చర్చల మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి.

1966 నుంచి 2026 వరకు పంజాబ్‌–హర్యానా సీఎంల సమావేశాలు – ఫలితాలేమిటి?

సట్లెజ్‌–యమునా లింక్‌ (ఎస్‌వైఎల్‌) కాలువ వివాదం పరిష్కారానికి సంబంధించి పంజాబ్‌–హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రులు 1966 తర్వాత పలుమార్లు సమావేశమైనప్పటికీ, ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ముఖ్యంగా 2020 నుంచి 2026 మధ్య కాలంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రధానంగా ఐదు సార్లు ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు జరిగాయి. అయితే అన్ని భేటీలూ “సానుకూల వాతావరణం”లో ముగిసినా, సమస్య మాత్రం యథాతథంగా కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి స్థాయి సమావేశాల వివరాలు – కాలక్రమం

ఆగస్టు 18, 2020

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పంజాబ్‌ సీఎం అమరిందర్‌ సింగ్‌, హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తొలిసారిగా అధికారికంగా సమావేశమయ్యారు.

ఫలితం: ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. కాలువ నిర్మాణంపై పురోగతి లేదు.

అక్టోబర్‌ 14, 2022

ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మరోసారి చర్చలు జరిగాయి.

ఫలితం: ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించుకున్నప్పటికీ, కీలక నిర్ణయాలు వెలువడలేదు.

జనవరి 4, 2023

కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో పంజాబ్‌, హర్యానా సీఎంల భేటీ జరిగింది.

ఫలితం: చర్చలు జరిగినప్పటికీ, వివాద పరిష్కార దిశగా గణనీయమైన పురోగతి కనిపించలేదు.

జులై 9–ఆగస్టు 5, 2025

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, హర్యానా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలో రెండు సమావేశాలు నిర్వహించారు.

ఫలితం: చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ఇరు రాష్ట్రాలు వెల్లడించాయి. సమావేశాల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు అధికారులు పని ప్రారంభించారు. అయినా, తుది పరిష్కారం దక్కలేదు.

జనవరి 27, 2026 (తాజా సమావేశం)

ఇరు సీఎంలు మరోసారి భేటీ అయ్యారు.

ఫలితం: రెండు రాష్ట్రాల అధికారులు నెలకు 3–4 సార్లు సమావేశమై అంశాన్ని చర్చించాలని నిర్ణయించారు. ఇది నిర్ణాయక పరిష్కారానికి దారితీసే ప్రారంభ అడుగుగా పేర్కొన్నారు.

మొత్తం సమావేశాల సంఖ్య

1966 తర్వాత ఎస్‌వైఎల్‌ కాలువ వివాదంపై కనీసం ఐదు ప్రధాన, అధికారిక ముఖ్యమంత్రి స్థాయి సమావేశాలు జరిగాయి. ఇవన్నీ ప్రధానంగా సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే నిర్వహించారు.