
హర్యానా నుంచి అంతర్జాతీయ స్థాయికి కబడ్డీ
భారతీయ సాంప్రదాయ క్రీడల్లో కబడ్డీకి ఉన్న ప్రత్యేకత కొత్త శిఖరాలను అధిరోహించబోతోంది. కబడ్డీలో యువ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అధికారికంగా అమెచ్యూర్ కబడ్డీ అసోషియేషన్ ఆఫ్ హర్యానా(ఏకేఏహెచ్) అనుమతితో కబడ్డీ చాంపియన్‌షిప్ లీగ్(కేసీఎల్) ను ప్రకటించారు. హర్యానా నుంచి ప్రారంభమవుతున్న ఈ అంబిషస్ స్పోర్ట్స్ ప్లాట్ ఫాం కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి 11, 2026 లో మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
ఎప్పటి నుంచో హర్యానా కబడ్డీకి పుట్టినిల్లు. భారత జట్టుకు ఇక్కడి ఆటగాళ్లు ఎన్నో విజయాలు అందించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఈ లీగ్ రాష్ట్రానికి గర్వ కారణమవుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.
స్టార్ ఆటగాడు అశు మాలిక్ మాట్లాడుతూ కేసీఎల్ యువతకు ఓ సరైన వేదిక తమ కబడ్డీ ప్రతిభను చూపించుకునే అద్భుతమైన అవకాశం. ఇది వారి భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. వేలాది మంది ఆటగాళ్లు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాల వారీగా యువకులు కబడ్డీ ఆడేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
మరో ప్రముఖ ఆటగాడు జై దీప్ దహియా మాట్లాడుతూ హర్యానా ఎప్పటి నుంచో భారత కబడ్డీకి వెన్నెముక. కేసీఎల్ వల్ల స్థానిక ఆటగాళ్లకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది అన్నారు.
నిరంతరం లీగ్ నిర్వహణ
లీగ్ ఒక్క సీజన్‌కే పరిమితం కాదు. నిరంతర క్రీడా పర్యావరణ వ్యవస్థగా రూపొందించబడుతోంది. యువ ఆటగాళ్లను గుర్తించి, మార్గ నిర్దేశం చేసి, జాతీయ-అంతర్జాతీయ స్థాయికి చేర్చడం లక్ష్యం. యోగేష్ దహియా మాట్లాడుతూ రాబోయే కాలంలో కేసీఎల్ కబడ్డీకి ప్రధాన వేదికగా నిలుస్తుందన్నారు. గత దశాబ్దంలో ఇరాన్, కొరియా, కెన్యా వంటి దేశాల్లో కబడ్డీకి విస్తృత ఆదరణ లభించింది. అయినా ఈ ఆటకు భారతే నిలయం. కేసీఎల్ ఈ ఆధిపత్యాన్ని మరింత బలపరచనుంది. ఆటగాళ్ల సంక్షేమం, పారదర్శకత, పోటీ స్థాయిలో కొత్త ప్రమాణాలు సృష్టించేందుకు ఈ లీగ్ ముందుకు వస్తోంది.
మరింత ఆకర్షణ
ఆటగాళ్ల వేలం, జట్టు ఫ్రాంచైజీలు, లైవ్ ప్రసారాల వంటి అంశాలతో కబడ్డీ ఆటగాళ్లు ఇప్పుడు గొప్ప స్థాయికి చేరుకునే అవకాశం పొందుతున్నారు. స్టార్ రైడర్ మోహిత్ గోయత్ మాట్లాడుతూ ఈ లీగ్ ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేస్తుంది. కబడ్డీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. ప్రతి రైడ్ పాయింట్‌కి ఒక చెట్టు నాటే ఎకో ఇనీషియేటివ్‌ను కూడా నిర్వాహకులు ప్రకటించారు. ఇది క్రీడతో పాటు పర్యావరణ పరిరక్షణకు చిహ్నంగా నిలవనుంది. కబడ్డీ ఛాంపియన్‌షిప్ లీగ్ కేవలం ఒక క్రీడా ఈవెంట్ కాదు. అది హర్యానా గౌరవం, యువతకు అవకాశాలు, భారత క్రీడలకు కొత్త యుగం.
