
హర్యానా అదనపు డీజీపీ ఆత్మహత్యపై భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి
డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలియజేయడానికి ఆదివారం సాయంత్రం చండీగఢ్ బయలుదేరనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 52 ఏళ్ల పూరన్ కుమార్ 'ఆత్మహత్య' దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
హర్యానా రాష్ట్రంలోని పంచకులాలో సీనియర్ ఐపీఎస్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పూరణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విషాదకరం, ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఒక ఏడీజీపీ స్థాయి అధికారి కూడా జాతి ఆధారిత వేధింపులకు గురై ప్రాణాలు కోల్పోయాడని సూచించారు. మృతుడి సూసైడ్ నోట్ ఆధారంగా బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తాయని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా మన దేశంలో ఇంకా కుల వివక్ష పేరుతో ఇలాంటి అమానుష సంఘటనలు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలను బీజేపీ ప్రభుత్వం నిశ్శబ్దంగా ప్రోత్సహిస్తోందనే భావన ప్రజల్లో పెరుగుతోంది.దేశంలో బీజేపీ పాలనలో అడిషనల్ డీజీ స్థాయి అధికారికి కూడా సామాజిక న్యాయం లభించడం లేదు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి" అని ఆయన అన్నారు. సమానత్వం, న్యాయం, మానవ హక్కులను కాపాడే శక్తి లేని పాలన, దేశాన్ని వెనక్కి తీసుకెళ్తుందన్నారు. మన సమాజంలో కులవివక్షకు, అన్యాయానికి చోటు లేకుండా ప్రతి ఒక్కరం చైతన్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్, అక్టోబర్ 10న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అనేక మంది రాజకీయ నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం, మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి దేశంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
లేఖలో పేర్కొన్న అంశాలు:
పూరణ్ కుమార్ తన ఎనిమిది పేజీల చివరి లేఖలో హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా వంటి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను స్పష్టంగా పేర్కొన్నారు. వీరు తనను వేధించారని తెలిపారు. ఈ లేఖలో ఇతర అధికారుల ద్వారా ఎదురైన కులం ఆధారిత వివక్ష తో సహా పలు వేధింపుల వివరాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
