
హర్యానాలో షాపు ఉద్యోగుల పని గంటలు పదికి పెంపు
హర్యానా రాష్ట్రంలో షాపులు, ప్రైవేట్ వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల రోజువారీ పని గంటలను 9 నుంచి 10 గంటలకు పెంచే బిల్లును సోమవారం హర్యానా శాసనసభ ఆమోదించింది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని పరిమితి యథాతథంగా కొనసాగుతుంది. ఈ మేరకు హర్యానా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (సవరణ) బిల్–2025ను సభలో ఆమోదించారు. ఈ బిల్లు ద్వారా 1958 నాటి చట్టానికి సవరణలు తీసుకువచ్చారు. బిల్లును ప్రవేశపెట్టిన కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ, చిన్న వ్యాపార సంస్థలపై ఉన్న నిబంధనల భారాన్ని తగ్గించి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు. అదే సమయంలో ఉద్యోగుల హక్కులకు రక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సవరణ ప్రతిపాదన తిరస్కరణ
రోజుకు 9 గంటల పని గంటలనే కొనసాగించాలని కోరుతూ సూర్జేవాలా సవరణ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, సభ వాయిస్ ఓటుతో తిరస్కరించింది. ఈ సందర్భంగా సూర్జేవాలా మాట్లాడుతూ, రోజుకు 10 గంటల పని + ఓవర్‌టైమ్ అంటే రోజుకు 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఆరు రోజులు ఇలా పనిచేస్తే ఉద్యోగికి తన కుటుంబానికి, తన జీవితానికి సమయం ఎక్కడ? అని ప్రశ్నించారు. సూర్జేవాలా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌నా? లేక ఆధునిక బానిసత్వాన్ని చట్టబద్ధం చేయడమా? అంటూ ఆయన విమర్శించారు.
ఓవర్ టైమ్ పరిమితి భారీగా పెంపు
ఈ బిల్లులో త్రైమాసిక ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి 156 గంటలకు పెంచే నిబంధనను కూడా చేర్చారు. దీంతో వ్యాపార అవసరాలు, పీక్ డిమాండ్ సమయంలో సంస్థలకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే, విశ్రాంతి లేకుండా నిరంతరంగా పని చేసే సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు. ఈ బిల్లు షాపులు, ప్రైవేట్ కమర్షియల్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు ఇది వర్తించదు. ప్రజలకు వస్తువులు లేదా సేవలు అమ్మే చిన్న దుకాణం నుంచి పెద్ద షోరూమ్ వరకు దీని పరిధిలోకి వస్తాయి.అక్కడ పనిచేసే ఉద్యోగుల పని గంటలపై ఈ కొత్త బిల్లు ప్రభావం చూపుతుంది.
చిన్న వ్యాపారాలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు
మంత్రి అనిల్ విజ్ వివరిస్తూ 20 మందికంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇకపై రిజిస్ట్రేషన్ అవసరం ఉండదని, కేవలం వ్యాపార సమాచారం ఇవ్వడం సరిపోతుందని తెలిపారు. ఇంతకుముందు ఉద్యోగులు లేకపోయినా ప్రతి షాపు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చేదని చెప్పారు.అయితే, దీనివల్ల 80 శాతం పైగా షాపులు చట్ట పరిధి నుంచి బయటపడతాయని సూర్జేవాలా ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిక
విజ్ తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా రోజువారీ పనిగంటలు 10గానే ఉన్నాయి. అలాగే 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా అమలులో ఉంది.
శీతాకాల సమావేశాల చివరి రోజు 8 బిల్లులు ఆమోదం
హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున మొత్తం 8 బిల్లులను సభ ఆమోదించింది. వాటిలో ముఖ్యమైనవి:
• హర్యానా ప్రైవేట్ యూనివర్సిటీస్ (సవరణ) బిల్–2025
• హర్యానా అబాది దేహ్ (యాజమాన్య హక్కుల నమోదు) బిల్–2025
• హర్యానా జన్ విశ్వాస్ (సవరణ) బిల్–2025
జన్ విశ్వాస్ బిల్ ద్వారా చిన్నచిన్న నేరాలకు సంబంధించిన 164 క్రిమినల్ నిబంధనలను తొలగించి, పౌర జరిమానాలు, పరిపాలనా చర్యలకు మార్పు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడుతుందని పేర్కొంది.
