Let's talk: editor@tmv.in
హర్యానాలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు నకిలీ ఓటరే: రాహుల్ గాంధీ

హర్యానాలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు నకిలీ ఓటరే: రాహుల్ గాంధీ

Pinjari Chand
6 నవంబర్, 2025

బీహార్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలు చేశారు. ఈ సారి హర్యానాలో భారీగా నకిలీ ఓటర్లను గుర్తించామని వివరించారు. ‘హెచ్’ ఫైల్స్ పేరుతో బుధవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. హర్యానాలో ప్రతి 8 మందిలో ఒకరు నకిలీ ఓటరేనని ఆరోపించారు. మొత్తం 25 లక్షల మంది లేని ఓటర్లను సృష్టించారని బాంబ్ పేల్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న అంచనాలు ఉన్నట్లుండి తారుమారయ్యాయని కారణం దీని వెనుక ఓ కేంద్రస్థాయి కుట్ర ఉందని ఆరోపించారు. మేం ఇది ఒక్క నియోజకవర్గ సమస్యే అనుకున్నాం. కానీ పరిశీలనలో మొత్తం రాష్ట్ర స్థాయిలోనే భారీగా ఓట్​ చోరీ జరిగిందని తేలిందన్నారు. పోస్టల్ ఓట్లు, బూత్ ఓట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉండడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఒక మహిళ ఫోటోతో 22 సార్లు ఓటు వేసిన రికార్డు తాము గుర్తించామని చెప్పారు. ఆ ఫోటో బ్రెజిలియన్ మోడల్‌ది అని ఇది ‘స్టాక్ ఫోటో’ అని తెలిపారు. ఇలాంటి రికార్డులు 25 లక్షల వరకు ఉన్నాయని వాటికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు.

మేం గెలిచే స్థితిలో ఉన్నాం. కానీ కేవలం 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈ మోసం జరిగి ఉండకపోతే ఫలితం మరోలా ఉండేది అని గాంధీ అన్నారు. ఇది కేవలం హర్యానాకే పరిమితం కాకుండా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన కుట్ర, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలంటూ రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్‌ను నిలదీశారు.

భారత యువత అర్థం చేసుకోవాలి

భారత యువతా! ఇది మీ భవిష్యత్తుతో సంబంధం ఉన్న విషయం. ఈ మోసాన్ని అర్థం చేసుకోండి అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోపణలపై హర్యానా ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించలేదు. కాంగ్రెస్ మాత్రం హెచ్ ఫైల్స్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలో పబ్లిక్ చేస్తాం అంటూ మరోసారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. 90 నియోజకవర్గాలు ఉన్న హర్యానాలో 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు, కాంగ్రెస్ 37 సీట్లు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 2, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలిచారు.

యువతే ప్రజాస్వామ్యానికి ప్రాణం

హర్యానా ఎన్నికల్లో జరిగిన భారీగా జరిగిన ఓటర్ల అవకతవకలను దేశ ప్రజాస్వామ్య ఆత్మపై దాడిగా వర్ణించిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, భారత యువతను ముఖ్యంగా యువతరానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను గుర్తుచేశారు. హర్యానా ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున డూప్లికేట్, నకిలీ పేర్లు ఉన్నాయని మళ్లీ స్పష్టం చేశారు. భారత యువతా, ఇది మీ భవిష్యత్తుతో సంబంధం ఉన్న విషయం. మీ భవిష్యత్తు నాశనం అవుతోంది. మీరు చూడాలి, వినాలి. సత్యం, అహింస అనే ఆయుధాలతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే శక్తి మీలో ఉందన్నారు. ఈ జాబితాలను సక్రమంగా నిర్ధారించడం ఎన్నికల సంఘం బాధ్యత అని, పార్టీలది కాదని తెలిపారు. ఓటర్ లిస్ట్ తప్పుగా ఉంటే అది నా సమస్య కాదు. అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. పార్టీలకు పూర్తి డేటాబేస్ ఇవ్వకుండానే సమస్య పరిష్కరించమంటారు. ఇది సాధ్యం కాదని రాహుల్ అన్నారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు సూచించాయని, కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఆ విజయాన్ని ఓటమిగా మార్చారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో జరిగిన మోసాన్ని రాహుల్ ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించారు. ఇది మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్‌ల ఆలోచనల మీద దాడి. గాంధీ గారిని హత్య చేశారు, ఇప్పుడు ఆయన ఆలోచనను హతమారుస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానమిస్తాం: హర్యానా సీఈవో

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘హెచ్ ఫైల్స్’ పేరిట చేసిన సంచలనాత్మక మీడియా సమావేశంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయి ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. దీనిపై హర్యానా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పందిస్తూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు సంబంధించిన వివరణాత్మక సమాధానం త్వరలో ఇస్తామని ఎక్స్ లో ప్రకటించారు.

హర్యానాలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు నకిలీ ఓటరే: రాహుల్ గాంధీ - Tholi Paluku