Let's talk: editor@tmv.in
హర్యానాలో జాతీయ స్థాయి బాడీ బిల్డర్ దారుణ హత్య

హర్యానాలో జాతీయ స్థాయి బాడీ బిల్డర్ దారుణ హత్య

Pinjari Chand
1 డిసెంబర్, 2025

హర్యానా రాష్ట్రం భివానీ జిల్లాలో ఓ వివాహ వేడుకలో సెల్ఫీ వివాదం నేపథ్యంలో 26 ఏళ్ల జాతీయ స్థాయి బాడీబిల్డర్‌ను కొందరు యువకులు ఇనుప రాడ్లు, హాకీ కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతుడు రోహతక్ జిల్లా హుమాయూన్‌పూర్ గ్రామానికి చెందిన రోహిత్ ధంకర్ (26)గా పోలీసులు తెలిపారు.

శుక్రవారం రాత్రి భివానీలో స్నేహితుడు జతిన్ బంధువు పెళ్లికి వెళ్లిన రోహిత్.. అక్కడ మహిళల సమక్షంలో అసభ్యకర భాష వాడుతూ, ప్రవేశ ద్వారం దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ మార్గంలో అడ్డుకుని నిలబడిన యువకుల బృందాన్ని మందలించాడు. ‘మహిళలు ఉన్నారు కదా.. సరిగ్గా ప్రవర్తించండి, మార్గం ఇవ్వండి’ అని రోహిత్ అనడంతో వాగ్వాదం జరిగింది.

పెళ్లి ముగిసిన తర్వాత జతిన్‌తో కలిసి కారులో వెళుతుండగా.. అదే యువకులు వెంటపడి రైల్వే క్రాసింగ్ దగ్గర వారి వాహనాన్ని అడ్డుకున్నారు. కారు అద్దాలు పగుల్గొట్టి, ఇనుప రాడ్లు, హాకీలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రోహిత్‌ను రోహతక్ పీజీఐఎంఎస్ ఆస్పత్రికి తరలించగా శనివారం మృతి చెందాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని ఈ దారుణానికి పాల్పడిన 15 మంది దుండగుల కోసం గాలిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో నలుగురి పేర్లు మాత్రమే నమోదయ్యాయి. మిగతా వారిని గుర్తిస్తున్నామని భివానీ సదర్ ఎస్హెచ్ఓ వికాస్ తెలిపారు. రోహిత్ రోహతక్‌లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ జాతీయ, రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు. 2016లో అప్పటి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతులు మీదుగా సత్కారం అందుకున్నారు. తల్లి, చెల్లెలు ఉన్న కుటుంబంలో ఏకైక ఆదాయ మార్గమైన రోహిత్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.