Let's talk: editor@tmv.in
హర్మూజ్‌ నుంచి సురక్షితంగా గుజరాత్ చేరుకున్న ‘నందా దేవి’ నౌక

హర్మూజ్‌ నుంచి సురక్షితంగా గుజరాత్ చేరుకున్న ‘నందా దేవి’ నౌక

Shaik Mohammad Shaffee
18 మార్చి, 2026

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, భారత చమురు నౌకల సురక్షిత ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతోంది. భారీ మొత్తంలో ఎల్‌పీజీ గ్యాస్‌తో ప్రయాణిస్తున్న భారత నౌక 'నందాదేవి' మంగళవారం గుజరాత్‌లోని వడివార్‌ (జామ్‌నగర్) పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. హర్మూజ్‌ జలసంధి గుండా సాగిన ఈ ప్రయాణంలో భారత నౌకాదళంతో పాటు ఇరాన్ నేవీ కూడా సహకరించడం గమనార్హం.

సముద్రంలోనే సరుకు బదిలీ

'నందాదేవి' నౌకలో సుమారు 46,500 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ఉంది. ఈ గ్యాస్‌ను పోర్టు యాంకరేజ్ వద్దే 'నందాదేవి' (మదర్ వెసెల్) నుంచి 'బీడబ్ల్యూ బిర్చ్' (డాటర్ వెసెల్) అనే మరో నౌకలోకి బదిలీ చేయనున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ స్వయంగా నౌకపైకి వెళ్లి, కెప్టెన్, సిబ్బందితో మాట్లాడారు. ఈ సరుకు బదిలీ మంగళవారమే ప్రారంభమైంది.

రెండవ భారీ నౌక.. నిరంతర సరఫరా

హర్మూజ్‌ జలసంధిని దాటి భారత తీరానికి చేరిన రెండవ ప్రధాన గ్యాస్ నౌక ఇది. అంతకుముందు సోమవారం సాయంత్రం 46,000 టన్నుల ఎల్‌పీజీతో 'షివాలిక్' నౌక ముంద్రా పోర్టుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ విజయవంతమైన ఆపరేషన్ గురించి నందాదేవి చీఫ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. "భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇరు దేశాల నౌకాదళాల చొరవతోనే ఇది సాధ్యమైంది. ఈ గ్యాస్ సరఫరా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని అధిగమించడంలో కీలకపాత్ర పోషిస్తుంది" అని హర్షం వ్యక్తం చేశారు.

పహారాలో మరిన్ని నౌకలు

యూఏఈ నుంచి 81,000 టన్నుల ముర్బాన్ ముడి చమురుతో బయలుదేరిన 'జగ్ లాడ్కి' నౌక కూడా ప్రస్తుతం సురక్షితంగా ప్రయాణిస్తోందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 22 భారతీయ నౌకలు ఉండగా, వాటిలో పనిచేస్తున్న 611 మంది నావికులు క్షేమంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు.