Let's talk: editor@tmv.in
హర్మూజ్‌ దాటిన మరో 2 భారత గ్యాస్ నౌకలు

హర్మూజ్‌ దాటిన మరో 2 భారత గ్యాస్ నౌకలు

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రతరమై ఇంధన సరఫరా నిలిచిపోయిన తరుణంలో భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత వేధిస్తున్న వేళ, సుమారు 94,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న రెండు భారీ భారతీయ నౌకలు 'హార్ముజ్ జలసంధి'ని సురక్షితంగా దాటాయి. 'బీడబ్ల్యూ టైర్', 'బీడబ్ల్యూ ఎల్మ్' అనే ఈ రెండు నౌకలు మరో రెండు రోజుల్లో భారత తీరానికి చేరుకోనున్నాయి. వీటిలో 'టైర్' నౌక మార్చి 31న ముంబైకి, 'ఎల్మ్' నౌక ఏప్రిల్ 1న మంగళూరుకు చేరుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

యుద్ధ నీడలో ఇంధన ప్రయాణం

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. అయితే శత్రుత్వం లేని దేశాల నౌకలను తమ అధికారుల సమన్వయంతో అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించడంతో భారత నౌకల రాకకు మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా మొత్తం ఆరు ఎల్‌పీజీ నౌకలు ఈ ప్రాంతం నుండి సురక్షితంగా బయటపడ్డాయి. ఇప్పటికే 'పైన్ గ్యాస్', 'జగ్ వసంత్', 'శివాలిక్', 'నందా దేవి' నౌకలు గుజరాత్ తీరానికి చేరుకొని గ్యాస్ నిల్వలను చేరవేశాయి. ఇవి కాకుండా ముడి చమురుతో వస్తున్న 'జగ్ లాడ్కీ', గ్యాసోలిన్‌తో వెళ్తున్న 'జగ్ ప్రకాశ్' కూడా క్షేమంగా జలసంధిని దాటాయి.

దిగుమతులపై ఆధారపడ్డ భారత్

భారత్ తన వంటగ్యాస్ అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. గతేడాది దేశం 33.15 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని వినియోగించగా, అందులో 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయి. ప్రస్తుత యుద్ధం వల్ల గల్ఫ్ సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో భారత్ ఇప్పుడు అమెరికా, అర్జెంటీనా వంటి దేశాల నుండి గ్యాస్‌ను సేకరిస్తోంది. ప్రస్తుతం మరో 18 భారతీయ నౌకలు, సుమారు 485 మంది నావికులు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోనే చిక్కుకొని ఉన్నారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది.

అప్రమత్తంగా డీజీ షిప్పింగ్

నావికుల రక్షణ, నౌకల గమనాన్ని పర్యవేక్షించేందుకు 'డీజీ షిప్పింగ్' కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తోంది. ఇప్పటివరకు 4,500లకు పైగా కాల్స్, 8,900లకు పైగా ఈమెయిల్స్ ద్వారా సహాయక చర్యలను సమన్వయం చేసింది. ఇప్పటివరకు 942 మంది భారత నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు. దేశంలోని అన్ని ఓడరేవుల్లో కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని, ఎక్కడా రద్దీ సమస్యలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.