
హరేకృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా ‘హెరిటేజ్ ఫెస్ట్’
హరేకృష్ణ మూవ్‌మెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక సాంస్కృతిక ఉత్సవం ‘హెరిటేజ్ ఫెస్ట్’ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఘనంగా జరిగింది. భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని యువతలో నాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
హరేకృష్ణ మూవ్‌మెంట్‌కు చెందిన సాంస్కృతిక విభాగం సుమేధస ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 60కిపైగా పాఠశాలల నుంచి సుమారు 12,000 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనేక నెలల పాటు నిర్వహించిన క్వాలిఫైయింగ్ రౌండ్లు, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ హరిచందన దాసరి, ఐఏఎస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ అధ్యక్షత వహించారు.
దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆలపించిన వేద మంత్రోచ్చారణలు సభకు ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి. అనంతరం విద్యార్థులు శాస్త్రీయ, జానపద నృత్యాలు, గాన సంగీతం, గీతా శ్లోక పఠనం, వేదిక్ క్విజ్, చిత్రలేఖనం, కథన ప్రదర్శనలు, రంగోలి, పురాణ పాత్రల వేషధారణలతో ప్రేక్షకులను అలరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉత్సవంలో 170 మందికిపైగా విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేయగా, విశేష ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు రోలింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రదానం చేశారు. పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలు, అతిథులను ప్రత్యేకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతీయ సంస్కృతి, విలువల పరిరక్షణకు కృషి చేస్తున్న హరేకృష్ణ మూవ్‌మెంట్‌ను ఆమె అభినందించారు. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘హెరిటేజ్ ఫెస్ట్’ నిర్వహించనున్నట్లు హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రకటించింది.
