Let's talk: editor@tmv.in
హరీశ్‌రాణా అంత్యక్రియలు పూర్తి

హరీశ్‌రాణా అంత్యక్రియలు పూర్తి

Pinjari Chand
26 మార్చి, 2026

భారత్‌లో పాసివ్ యూతనేషియా(కారుణ్య మరణం)కు అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీశ్‌రాణాకు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 13 సంవత్సరాల పాటు కోమాలో జీవించిన ఆయనకు ఇది ఒక భావోద్వేగ ముగింపుగా నిలిచింది. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ శ్మశానవాటికలో ఉదయం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఎన్జీఓ ప్రతినిధులు, అలాగే బ్రహ్మకుమారీస్‌ సభ్యులు పాల్గొని నివాళులు అర్పించారు. ఘజియాబాద్‌లోని రాజ్ ఎంపైర్ సొసైటీ నివాసితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హరీశ్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతూ ‘అతను ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఏడవకండి’ అంటూ అక్కడున్నవారిని ఓదార్చారు. తల్లి చేతులు జోడించి కుమారుడికి చివరి వీడ్కోలు పలికింది. తమ్ముడు అశీష్ రాణా చితికి నిప్పు పెట్టగా, సోదరి భావ్నా కూడా పాల్గొన్నారు. పుష్పాలతో అలంకరించిన వేదికపై హరీశ్‌రాణా మృతదేహాన్ని ఉంచి, పలువురు గౌరవప్రదంగా నివాళులు అర్పించారు. కొందరు కాషాయ పూలమాలలు సమర్పించి చివరి వీడ్కోలు పలికారు.

కళ్లు దానం

హరీశ్ కుటుంబం ఆయన కళ్లను దానం చేయాలని నిర్ణయించింది. ఇతర అవయవాల దానం గురించి స్పష్టత లేదు. ఈ నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు. బ్రహ్మ కుమారీస్ సంస్థకు చెందిన సిస్టర్ లవ్లీ మాట్లాడుతూ, అంత్యక్రియల సమయంలో ధ్యాన ప్రార్థనలు నిర్వహించామని తెలిపారు. త్వరలో ‘భోగ్’ కార్యక్రమం నిర్వహించి, హరీశ్ ఇష్టపడే ఆహారాలను ప్రతీకాత్మకంగా సమర్పిస్తామని చెప్పారు. శరీరం ఈ లోకాన్ని విడిచిపెడుతుంది, కానీ ఆత్మ శాశ్వతమని ఆమె పేర్కొన్నారు.

నేపథ్యం

హరీశ్‌రాణా 2013లో పంజాబ్‌ యూనివర్సిటీ లో బీటెక్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలు అయ్యి కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కృత్రిమ జీవనాధారం, వైద్య సహాయంతోనే జీవించారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన అనుమతితో పాసివ్ యూతనేషియా అమలు చేశారు. జీవనాధార వ్యవస్థలను క్రమంగా తొలగించడంతో ఆయన మంగళవారం కన్నుమూశారు.

కుటుంబం పోరాటం

గత 13 ఏళ్లుగా హరీష్ కోసం కుటుంబం చూపిన సేవ, త్యాగం అందరినీ కదిలించింది. ఈ నిర్ణయం చాలా బాధాకరమైనదే అయినా, అతని గౌరవప్రదమైన ముగింపుకోసం అవసరమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన ‘గౌరవప్రద మరణ హక్కు’పై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కీలక పరిణామంగా నిలిచింది.

హరీశ్‌రాణా అంత్యక్రియలు పూర్తి - Tholi Paluku