
హరివంశ్ నారాయణ సింగ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటరీ వ్యవహారాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్‌ను తిరిగి రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేస్తూ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో బీహార్ నుండి జనతాదళ్ (యునైటెడ్) ప్రతినిధిగా ఉన్న ఆయన పదవీకాలం ఏప్రిల్ 9తో ముగిసింది. ఈ నేపథ్యంలో, ఆయన అనుభవాన్ని, సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్వారా ఆయనను నామినేటెడ్ కోటాలో ఎంపిక చేసింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీని హరివంశ్ భర్తీ చేయనున్నారు.
69 ఏళ్ల హరివంశ్ నారాయణ సింగ్‌కు సుదీర్ఘమైన రాజకీయ, పాత్రికేయ నేపథ్యం ఉంది. భారత రాజ్యాంగంలోని అధికరణ 80 ప్రకారం, కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సేవ వంటి రంగాలలో విశేష కృషి చేసిన వారిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. హరివంశ్ విషయంలో ఆయనకున్న అపారమైన పార్లమెంటరీ అనుభవం, నిష్పక్షపాతంగా సభను నడిపించే తీరు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమయ్యాయి. 2018 నుండి ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, సభా మర్యాదలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
హరివంశ్ తన పార్లమెంటరీ ప్రస్థానంలో అనేక కీలక కమిటీలలో సభ్యుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. వ్యవసాయ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీలలో ఆయన సభ్యుడిగా సేవలందించారు. అంతేకాకుండా, ఎంపీ నిధుల వినియోగం, ప్రివిలేజ్ కమిటీలకు చైర్మన్‌గా వ్యవహరించి సభా నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. మోటార్ వాహనాల సవరణ బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లు వంటి కీలక చట్టాల పరిశీలనలో జాయింట్ కమిటీ సభ్యుడిగా ఆయన అందించిన సలహాలు ఎంతో విలువైనవి.
కేవలం సభా నిర్వహణకే పరిమితం కాకుండా, విధానపరమైన నిర్ణయాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ విపత్తు రిస్క్ తగ్గింపు ప్లాట్‌ఫారమ్‌లో సభ్యుడిగా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన సలహా కమిటీలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజ్యసభ టెలివిజన్ కంటెంట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. 2014లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన, 2020లో రెండోసారి ఎన్నికయ్యారు. తాజా నామినేషన్‌తో ఆయన తన పార్లమెంటరీ ప్రస్థానాన్ని కొత్త కోణంలో కొనసాగించబోతున్నారు.
గత బడ్జెట్ సమావేశాల సమయంలో, సభాపతి గైర్హాజరీలో హరివంశ్ కీలకమైన బాధ్యతలను భుజాన వేసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా సభను సమర్థవంతంగా నడిపించి అందరి ప్రశంసలు పొందారు. ఏప్రిల్ 9న ఆయన పదవీకాలం ముగియడంతో ఏర్పడిన శూన్యతను పూడ్చేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయనను నామినేటెడ్ సభ్యుడిగా ఎంపిక చేయడం విశేషం. ఈ నిర్ణయంతో రాజ్యసభలో ఆయన అనుభవం సభా కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హరివంశ్ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యిన సందర్భంగా ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో హరివంశ్ జర్నలిజం, ప్రజా జీవితానికి అందించిన సేవలు వెలకట్టలేనివి, ఒక గొప్ప మేధావిగా, ఆలోచనాపరుడిగా తన లోతైన విశ్లేషణలతో గత కొన్నేళ్లుగా సభాగౌరవాన్ని పెంపొందించారు. రాష్ట్రపతి ఆయనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయడం నిజంగా సంతోషకరం. ఈ కొత్త పదవీకాలంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని, తన మేధస్సుతో పార్లమెంటరీ కార్యకలాపాలను మరింత సుసంపన్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.
