Let's talk: editor@tmv.in
హ‌మాస్ దాడుల‌పై న్యూయార్క్‌లో ప్ర‌చారం!

హ‌మాస్ దాడుల‌పై న్యూయార్క్‌లో ప్ర‌చారం!

Venkatesh Balusula
27 సెప్టెంబర్, 2025

న్యూయార్క్‌లో ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు సైతం ఈ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగానికి ముందు శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర ఘ‌ట‌నలు చోటు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆధ్వ‌ర్యంలో న్యూయార్క్‌లో ప్రజా దౌత్య ప్రచారం ప్రారంభించింది. తమ ఆలోచనలు, విధానాలు, సందేశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ వ్యూహాత్మక కార్యక్రమం చేప‌ట్టారు. ఐరాస ప్ర‌ధాన కార్యాల‌యం చుట్టూ టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద బిల్‌బోర్డులు, మొబైల్ ట్రక్కులు "రిమెంబర్ అక్టోబర్ 7" సందేశాన్ని ప్ర‌ద‌ర్శించారు. హమాస్ నేతృత్వంలోని దాడుల తీవ్ర‌త‌ను, గాజాలో బందీలుగా ఉన్న 48 మంది బందీల దుస్థితి గుర్తు చేసేలా ఈ ప్రచారం రూపొందించారు.

అక్టోబ‌ర్ 7న ఏం జ‌రిగింది?

రెండేళ్ల క్రితం అక్టోబర్ 7న‌ పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడిలో హమాస్ సభ్యులు గాజా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చి సైనికులు, పౌరుల‌పై దాడులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు, విదేశీయులు మరణించారు. పదుల సంఖ్యల్లో బందీల‌య్యారు. ఈ దాడి ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణలో తీవ్రమైన అధ్యాయంగా నమోదైంది. దీని తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విస్తృత సైనిక చర్యలు చేపట్టింది. "రిమెంబర్ అక్టోబర్ 7" ప్రచారం ఈ దాడిని, బందీల దుస్థితిని గుర్తు చేసేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ప్రయత్నంగా తెలుస్తోంది.

ప్ర‌తి ట్ర‌క్కుపై క్యూఆర్ కోడ్‌

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 80వ యూఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగానికి ముందు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ నాయకులు, ప్రజలు హమాస్ దారుణాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్ లో ఓ పోస్ట్ చేసింది. ఐరాస‌ భవనం చుట్టూ, టైమ్స్ స్క్వేర్‌లో పెద్ద బిల్‌బోర్డులు, ట్రక్కులతో ప్రచారం నిర్వహిస్తున్నామ‌ని తెలిపింది. హమాస్ చేసిన దారుణాలు, గాజాలో 48 మంది బందీల బాధ‌ను గుర్తు చేయడం ఈ ప్రచారం ఉద్దేశ్యమని పేర్కొంది. ప్రతి బిల్‌బోర్డు, ట్రక్కుపై "రిమెంబర్ అక్టోబర్ 7" నినాదం ప్రదర్శిస్తున్నారు. దానిపై ఉన్న‌ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 2023 అక్టోబర్ 7 దాడి డాక్యుమెంటేషన్ వెబ్‌సైట్‌కు తెరుచుకుంటుంది. ప్రధాని, ఆయన బృందం ప్రస్తుత సందర్శనలో ప్రజా దౌత్యానికి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు ప్ర‌ధాని కార్యాలయం తెలిపింది.

చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐరాస‌లో ప్ర‌సంగించారు. దీనికి ముందు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఉద్వేగ‌మైన‌ ప్రసంగం చేశారు. ఇజ్రాయెల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల‌కు పాల్ప‌డుతోంద‌న్నారు. యుద్ధానంతర గాజా పాలనలో హమాస్ పాత్ర ఆరోప‌ణ‌ల‌ను తిరస్కరించారు. అమెరికా ప్ర‌భుత్వం వీసాలు నిరాకరించడంతో అబ్బాస్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఐరాస స‌భ‌లో మాట్లాడారు. గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలు, మానవత్వ వ్యతిరేక నేరాలుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులు చరిత్రలో భయానక అధ్యాయంగా నిలిచిపోతాయ‌ని అబ్బాస్ అన్నారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న‌ హమాస్ జ‌రిపిన‌ చర్యల‌ను సమర్థించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ ప్రభుత్వంలో హమాస్ పాత్ర ఉండదని, ఆయుధ సమూహాలు ఆయుధాలు వదులుకోవాలని పేర్కొన్నారు. హమాస్, ఇతర గ్రూపులు ఆయుధాల‌ను పాలస్తీనా నేషనల్ అథారిటీకి అప్పగించాలని, ఒకే రాష్ట్రం, ఒకే చట్టం, ఒకే భద్రతా బలగం నిర్మాణం కోసం ఇది అవసరమని అబ్బాస్ వ్యాఖ్యానించారు.

సానుభూతి కోస‌మే ఇజ్రాయెల్ ప్ర‌య‌త్నాలు?

గాజా దాడుల‌తో ఇజ్రాయెల్‌పై అంత‌ర్జాతీయంగా వ‌స్తున్న ఒత్తిడికి, పాల‌స్తీనాకు ప‌లు దేశాల నుంచి గుర్తింపు వ‌స్తున్న నేప‌థ్యంలో నెత‌న్యాహు ప్ర‌జా దౌత్యం, ఇత‌ర దేశాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ "రిమెంబర్ అక్టోబర్ 7" ప్రచారం ద్వారా 2023 హమాస్ దాడిని గుర్తు చేస్తూ సానుభూతి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ చ‌ర్య‌లు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా చిత్రీకరించి, బందీల విడుదలకు ఒత్తిడి తెచ్చే అవ‌కాశ‌ముంది. ఏకంగా ఐరాస కార్యాల‌యం ప‌రిస‌రాల్లో ఇలాంటి ప్రచారాలు నిర్వ‌హించ‌డం వెనుక ప్రపంచ దృష్టి ఆకర్షించే వ్యూహం దాగి ఉంది. కేవ‌లం అంత‌టితో ఆగ‌కుండా క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంటేషన్ అందుబాటులో ఉంచుతూ డిజిటల్ మీడియాలోనూ ప్ర‌చారానికి తెర‌లేపారు. ఇవ‌న్నీ ఇజ్రాయెల్‌కు మ‌ద్ద‌తు తీసుకొస్తాయ‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేం. ఇప్ప‌టికీ ప్ర‌పంచ దేశాలు, ప్ర‌జ‌ల్లో ఇజ్రాయెల్ వైఖ‌రిపై, దాడుల‌పై వ్య‌తిరేక‌త కొన‌సాగుతూనే ఉంది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఇజ్రాయెల్ చర్యల‌ను మానవత్వ వ్యతిరేక నేరాలుగా ఖండిస్తూ, భ‌విష్య‌త్తులో గాజాలో హమాస్ పాత్రను తిరస్కరించారు. అబ్బాస్ హమాస్ ఆయుధాలు వదులుకోవాలని చెప్పడం శాంతి చర్చలకు మార్గం సుగమం చేయవచ్చు, కానీ హమాస్ బలంగా ఉన్న గాజాలో ఇది సాధ్య‌మ‌వుతుంద‌న్న గ్యారంటీ లేదు. మొత్తానికి ఐరాస వేదిక‌గా ఇజ్రాయెల్ తన బాధితులు ద్వారా సానుభూతి పొందాలని చూస్తుంటే, పాలస్తీనా గాజా విపత్తును ప్ర‌పంచానికి చూపిస్తోంది. ఈ ఘ‌ట‌న‌లు యుద్ధ ముగించేందుకు, శాంతి స్థాప‌న‌కు మరిన్ని సవాళ్లు తీసుకొస్తున్నాయి.

ఓవైపు నెత‌న్యాహు హమాస్‌ను పూర్తిగా నాశ‌నం చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. పాల‌స్తీనాకు గుర్తింపునిచ్చే దేశాల‌ను కూడా బ‌హిరంగంగా త‌గిన మూల్యం చెల్లించుకుంటారంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. శాశ్వ‌తంగా కాల్పులు విర‌మించాల‌ని, ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా త‌ప్పుకోవాల‌ని హ‌మాస్ డిమాండ్ చేస్తోంది. ఇరు వ‌ర్గాల డిమాండ్లు భిన్నంగా ఉండ‌టంతో యుద్ధం నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఫ‌లితంగా సామాన్యులు బ‌లైపోతున్నారు. గాజాలా ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, మ‌రెంతో మంది నిరాశ్ర‌యుల‌య్యారు. రోజురోజుకీ ప‌రిస్థితులు దిగ‌జారుతున్న యుద్ధం ముగిసే దారి క‌నిపించ‌డం లేదు. అంత‌ర్జాతీయ దౌత్యం కూడా ఈ చ‌ర్చ‌ల్లో ప‌ని చేయ‌క‌పోవ‌డం మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఈ ఐరాస స‌భ‌ల్లోనైనా ఇజ్రాయెల్‌, గాజా యుద్ధానికి ఏదైనా ప‌రిష్కారం ల‌భిస్తుందో వేచి చూడాలి.

హ‌మాస్ దాడుల‌పై న్యూయార్క్‌లో ప్ర‌చారం! - Tholi Paluku