
హన్మకొండలో నకిలీ క్లినిక్‌పై డీసీఏ దాడులు.. 30 రకాల మందులు స్వాధీనం
హన్మకొండ జిల్లాలో అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది. శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో ఎటువంటి వైద్య అర్హత లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నమ్మదగిన సమాచారంపై చర్యలు చేపట్టిన డీసీఏ అధికారులు ఫిబ్రవరి 21న శాయంపేట మండలంలోని శాయంపేట గ్రామంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ క్లినిక్‌ను రాచర్ల ప్రభాకర్ అనే వ్యక్తి అవసరమైన వైద్య అర్హతలు లేకుండానే నడుపుతున్నట్లు డీసీఏ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైద్య పట్టాలు లేకుండా వైద్యం నిర్వహించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
తనిఖీల సమయంలో అధికారులు మొత్తం 30 రకాల మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వైద్యులకు మాత్రమే ఉద్దేశించిన ఫిజిషియన్ సాంపిల్స్, సంస్థాగత సరఫరా కోసం మాత్రమే అనుమతించబడిన మందులను, అధిక శ్రేణి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, అలాగే అలవాటు పడి వినియోగించే ప్రమాదం ఉన్న ట్రామడాల్ ఇంజెక్షన్లు వంటి హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఉన్నాయని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందుల మొత్తం విలువ సుమారు రూ.35,000గా అంచనా వేశారు.
తనిఖీలలో పలు అధిక యాంటీబయోటిక్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్‌ను విచక్షణారహితంగా విక్రయించడం, వినియోగించడం వలన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా మందులు పనిచేయని పరిస్థితులు ఏర్పడవచ్చని అధికారులు పేర్కొన్నారు. అలాగే స్టెరాయిడ్ల దుర్వినియోగం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత, కండరాలు, ఎముకల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు, మానసిక రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు వివరించారు.
కఠిన చర్యలు - హెచ్చరికలు
ఈ దాడిని హనుమకొండ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జె. కిరణ్ కుమార్, వరంగల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పి. శ్రవణ్ కుమార్‌లు నిర్వహించగా, వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి. రాజ్యలక్ష్మి పర్యవేక్షించారు. స్వాధీనం చేసుకున్న మందుల నమూనాలను విశ్లేషణ కోసం సేకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అర్హతలేని వ్యక్తులు, లైసెన్స్ లేని వ్యక్తులకు మందులు సరఫరా చేసే డీలర్లపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సరఫరా చేసే ముందు సదరు సంస్థ లైసెన్స్‌ను సరిచూసుకోవాలని సూచించారు. చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా మందులను నిల్వ చేయడం లేదా విక్రయించడం చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అక్రమ మందుల తయారీ లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే ప్రజలు డీసీఏ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు కోరారు.
