
హనుమకొండలో ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
భారీ వరదలతో ముంపునకు గురైన హనుమకొండ జిల్లాలోని పలు కాలనీల్లో పేరుకుపోయిన బురద మట్టిని తొలగించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తోంది.జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు బురద మట్టి తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. శనివారం ఉదయం నుంచే సమ్మయ్య నగర్, అమరావతి నగర్, జవహర్ నగర్, గోపాలపూర్, ఇతర ప్రభావిత కాలనీల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆరు ఫైర్ ఇంజన్ల వినియోగం
వరదల కారణంగా ఈ ప్రాంతాల ఇళ్లలో, పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, అలాగే రోడ్లపై భారీగా బురద మట్టి పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు మొత్తం ఆరు ఫైర్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. హనుమకొండ జిల్లా అగ్నిమాపక అధికారి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఫైర్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బురద మట్టిని నీటి ప్రెషర్ సహాయంతో తొలగించి వీధులు, గృహాల పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది కృషి
సహాయక చర్యలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. హనుమకొండతో పాటు పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, వరంగల్ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్ల తరలించి పనులను వేగవంతం చేశారు. ఈ చర్యలతో ముంపు బాధిత కాలనీల ప్రజలు ఊపిరి పీలుస్తున్నారు.
వరదలతో తీవ్రమైన నష్టం వాటిల్లిన కాలనీలలో ప్రజలు ఇళ్లలోకి చేరే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద తొలగింపు చర్యలు పూర్తవగానే రవాణా, విద్యాసంస్థల కార్యకలాపాలు క్రమంగా పునరుద్ధరించబడతాయని అధికారులు తెలిపారు.అధికారుల సమన్వయంతో జరుగుతున్న ఈ ముమ్మర చర్యలు ప్రజలకు తాత్కాలిక ఊరటను కలిగిస్తున్నాయి.అధికారుల అంచనా ప్రకారం, హనుమకొండ పరిధిలో జరుగుతున్న ఈ సహాయక చర్యలు మరిన్ని 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.
బురదను ఫైర్ ఇంజన్లతో శుభ్రపరిచి, మురుగునీటిని డ్రైన్ల ద్వారా వదిలిస్తున్నారు.అలాగే ఘన మట్టి, చెత్త మిశ్రమాన్ని మున్సిపల్ ట్రాక్టర్లు, డంపర్ లారీలు ద్వారా సేకరించి, డంప్ యార్డులకు తరలిస్తున్నారు.
