Let's talk: editor@tmv.in
హైదరాబాదులో 'చలో జీతే హై' సినిమా ప్రదర్శన

హైదరాబాదులో 'చలో జీతే హై' సినిమా ప్రదర్శన

T Venkata Ramana
23 సెప్టెంబర్, 2025

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితం, నాయకత్వంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాదులోని పలు థియేటర్లలో 'చలో జీతే హై' అనే సినిమాను ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ ప్రత్యేక ప్రదర్శనలు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు కొనసాగుతాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఈ ప్రదర్శనలను పర్యవేక్షిస్తోంది.

ప్రదర్శనల లక్ష్యం

మోడీ బాల్యం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆదర్శాలతో కూడిన 'చలో జీతే హై' సినిమాను ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరువ చేయడమే ఈ ప్రదర్శనల ప్రధాన లక్ష్యం. మోడీ స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా ద్వారా ఆయన నాయకత్వ లక్షణాలను, ప్రజలకు సేవ చేయాలనే ఆయన ఆశయాలను వివరిస్తున్నారు. అనేక పాఠశాలల విద్యార్థులకు ఈ సినిమాను ప్రత్యేకంగా చూపిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు మోడీ జీవితం నుంచి స్ఫూర్తి పొందేలా ప్రోత్సహిస్తున్నారు.

విమర్శలు

ప్రధాని మోడీ బాల్యంపై రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రదర్శించాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ఇది రాజకీయ ప్రచార చర్య అని, మహాత్మాగాంధీ జయంతి రోజు వరకు ప్రదర్శనలు కొనసాగించడం గాంధీని అవమానించడమేనని ఆరోపించింది. అయితే, తెలంగాణ బీజేపీ కార్యాలయం ఈ విమర్శలను ఖండించింది. ఈ ప్రదర్శనలు కేవలం మోడీ జీవితం నుండి ప్రేరణ పొందడానికి ఉద్దేశించినవని ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని పేర్కొంది.

థియేటర్ల వివరాలు

నిజామాబాదులోని పీవీఆర్ మాల్, వరంగల్, ఆర్మూర్ లోని పీవీఆర్ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. హైదరాబాదులోని ప్రధాన థియేటర్లైన ప్రసాద్స్ ఐమాక్స్, ఏషియన్ సినిమాస్, పీవీఆర్ సినిమాస్ వంటి వాటిలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.మెహదీపట్నం, సైబరాబాద్ లోని పీవీఆర్ లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉప్పల్ లోని సినీ పోల్స్, సీసీపీఎల్ మాల్ లోనూ ఈ చిత్రం ఆడుతోంది. ప్రతి థియేటర్లో రోజుకు రెండు, మూడు షోలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాదులో 'చలో జీతే హై' సినిమా ప్రదర్శన - Tholi Paluku