Let's talk: editor@tmv.in
హైదరాబాదీలకు వర్షాల కష్టాలు

హైదరాబాదీలకు వర్షాల కష్టాలు

T Venkata Ramana
20 సెప్టెంబర్, 2025

వారంరోజులుగా హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా నగరంలో సగటున 150 మి.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా జంట నగరాలైన సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్‌పేట్, ఉప్పల్ వంటి ప్రాంతాలు అధిక వర్షపాతంతో అతలాకుతలమయ్యాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై, భారీ ట్రాఫిక్ జామ్‌లతో నగరం స్తంభించిపోతోంది.

చిరు వర్షానికే మునిగిపోతున్న రహదారులు

చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరదనీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటిలో వాహనాలు ఆగిపోవడం, సైలెన్సర్లలో నీరు చేరి మొరాయించడం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఒక్కరోజు వర్షం పడితే దాని ప్రభావం మూడు రోజుల వరకు ఉంటుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వీటిలో వర్షం 100 మిల్లీమీటర్ల నుంచి 184.5 మిల్లిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ లో 184.5 మిల్లిమీటర్లు, చిలకలగూడలో 147.5 మిల్లిమీటర్లు, మోండా మార్కెట్‌లో 146.8మిల్లి మీటర్లు, న్యూ మెట్టుగూడ, మారేడుపల్లిలో 140.5 మిల్లీమీటర్లు, ముషీరాబాద్ లో 136.5 మిల్లీమీటర్లు, బన్సిలాల్ పేటలో 135 మిల్లీ మీటర్లు, సీతాఫల్ మండిలో 134 మిల్లీ మీటర్లు, పాటిగడ్డలో 128.3మిల్లీ మీటర్లు, శేర్ లింగంపల్లిలో 144.8, మియాపూర్ లో 130.8 మిల్లీ మీటర్లు, లింగంపల్లిలో 130 మిల్లీ మీటర్లు, గచ్చిబౌలిలో 123.5 మిల్లీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 108.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఫలితం ఇవ్వని సబ్‌వేలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఫైఓవర్లు నిర్మించినా ఎన్ని సబ్ వేలు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. మెట్రో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అదే సమయంలో ఇక వర్షం పడితే మామూలుగా ఉండదు. జంక్షన్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. రోడ్లపైకి నీరు చేరుతుండటంతో పాటు వాహనాలు బంపర్ టు బంపర్ గా వెళుతుండటంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. అనేక వాహనాలు వర్షపు నీరు కారణంగా నిలిచిపోయి మొరాయిస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.

ట్రాఫిక్ నరకం

వర్షాల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది. నగరంలో దాదాపు 90 లక్షలకు పైగా ఉన్న వాహనాలు రోడ్లపైకి ఒక్కసారిగా రావడం, వర్షం వల్ల రహదారులు జలమయం కావడంతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. ఎల్బీనగర్ జంక్షన్, మలక్‌పేట, నల్లగొండ చౌరస్తా, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, ఐకియా సెంటర్ వంటి కీలక జంక్షన్లలో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడం అంటే విజయవాడ వెళ్లి రావడం కంటే కష్టమని నగరవాసులు సెటైర్లు వేస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షం ధాటికి అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. కేవలం వర్షం పడితేనే కాదు.. మామూలు రోజుల్లోనూ ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. సిగ్నలింగ్ వ్యవస్థ పెట్టినప్పటికీ గంటల తరబడి ఎదురుచూసి తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలు అన్నీ రోడ్లపైకే వస్తుండటంతో కాలుష్యం కూడా భారీగా పెరుగుతుంది.

యూ-టర్న్‌ల సమస్య

నగరంలో అనేక చోట్ల పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం యూ-టర్న్‌లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి ట్రాఫిక్ ను మరింత పెంచుతున్నాయి. అర నిమిషంలో దాటాల్సిన చౌరస్తా కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. భారీ వాహనాలు యూ-టర్న్ తీసుకోవడానికి స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ మరింతగా నిలిచిపోతోంది. పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను దుకాణదారులు, ద్విచక్రవాహనదారులు ఆక్రమించడంతో పాదాచారులు రోడ్లపైనే నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది కూడా ట్రాఫిక్ కు అదనపు కారణం అవుతుంది. ట్రాఫిక్ జామ్‌లతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడం వల్ల కాలుష్యం కూడా భారీగా పెరుగుతోంది. వాహనాల నుంచి వెలువడే పొగతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

నీళ్లలోనే పలు కాలనీలు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముషీరాబాద్‌ ప్రాంతంలోని పలు కాలనీలు రెండు రోజులుగా ముంపులోనే ఉన్నాయి. గాంధీనగర్, అశోక్‌నగర్, హిమాయత్‌నగర్‌లోనూ కొన్ని అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునిగాయి. పాతబస్తీలో పలు ప్రాంతాలు, ఖైరతాబాద్‌ బస్తీలు, అమీర్‌పేట, బల్కంపేటల్లో కొన్ని కాలనీలూ నీటిలోనే ఉన్నాయి. సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని పలుచోట్ల కూడా ప్రజలు ఈ బాధలే ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం కృష్ణానగర్‌లో రహదారులపై రెండు మీటర్ల లోతున ప్రవాహం ఉంది. అనేకచోట్ల ఇళ్లముందు నిలిపి ఉంచిన పదుల సంఖ్యలో బైక్‌లు నాలాల్లో కొట్టుకుపోయాయి. ఈ దుస్థితికి కారణం తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడం ఒకటైతే, నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణమని ఆరోపిస్తున్నారు. నివాసాల్లో వరద ఇంకే ఏర్పాట్లు ఎక్కడా లేవు. ఇళ్లపై కురిసిన వర్షమంతా రోడ్లపైకే వస్తోంది. మొత్తం కలిసి ఏరులై ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణం జరగలేదు. ఉన్నవాటిలో పూడిక తీయకపోవడం, ఆక్రమణలు పెరిగిపోవడంతో కుంచించుకుపోయాయి.

ప్రాణాలు పోతున్నాయి

వర్షంతో కేవలం రోడ్లు జలమయం, ట్రాఫిక్ స్తంభించిపోవడం ఒక్కటే కాదు. ఏకంగా ప్రాణాలు కూడా పోతున్నాయి. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ముషీరాబాద్‌ సమీపంలోని భోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ షర్ఫుద్దీన్‌ వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న షర్ఫుద్దీన్ తన బైక్‌పై రాత్రి 9.30 గంటలకు ఇంటికి బయలుదేరగా మార్గం మధ్యలోని బల్కంపేట అండర్‌ బ్రిడ్జి కింద నిలిచిన వరదలో రాత్రి 11.30 గంటలకు చిక్కుకున్నాడు. నీటిలో మొరాయించిన వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా నాలుగు వైపుల నుంచి వరద పోటెత్తి బయటకు రావడం కష్టమైంది. స్థానికులు, ‌ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఎంత ప్రయత్నించినా షర్ఫుద్దీన్‌ను కాపాడలేకపోయారు. అంతకు మందు వారంలోనూ ముగ్గురు వరదల వల్ల కాలువలో కొట్టుకుపోయారు. ఇలా నగరంలో వర్షం పడితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి తలెత్తింది.

వర్షం హెచ్చరికలు

వాతావరణ శాఖ నివేదికల ప్రకారం రానున్న రెండు రోజుల్లో కూడా నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య, కాలుష్యం వంటి వాటికి చెక్ పెట్టాలంటే ఢిల్లీ తరహాలో 'సరి-బేసి' విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గి, ట్రాఫిక్ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

హైదరాబాదీలకు వర్షాల కష్టాలు - Tholi Paluku