
హైడ్రా భారీ ఆపరేషన్
హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడింది. దీని విలువ సుమారు 15 వేల కోట్లు ఉంటుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. సర్వే నంబర్ 307లో 300 ఎకరాలకుపైగా భూమిని ఆక్రమించినట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఆ భూములను కాపాడింది. ఆదివారం ఉదయం భారీ బందోబస్తుతో హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విక్రయించారు. ఈ స్థలం రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందిందని తెలుస్తోంది. ప్రభుత్వ స్థలంలో 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున విక్రయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదు అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణదారుల చేతుల్లో రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది.
మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులు ఇచ్చి ఇళ్లను కొనుగోలు చేశామని చెప్పారు. వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. కూల్చివేతల అనంతరం మొత్తం 300 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కంచె వేయనుంది.
కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 40 ఎకరాల్లో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అధికారులతో స్థానిక నేతలు కుమ్మక్కై పేదలకు స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో ఐదుసార్లు స్థానికులతో హైడ్రా, రెవెన్యూ అధికారులు మాట్లాడారన్నారు. కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు.
‘పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదు. వాణిజ్య షెడ్లు, కాంపౌండ్ గోడలు, గదులు నిర్మించిన వాటిని తొలగిస్తాం. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని కంచె ఏర్పాటు చేస్తాం. రూ.13 వేల కోట్ల విలువైన 275 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకుంటాం’ అని రంగనాథ్ తెలిపారు.
