Let's talk: editor@tmv.in
హైడ్రా కూల్చివేతలపై రాజకీయం

హైడ్రా కూల్చివేతలపై రాజకీయం

Aravind Maryada Reddy
23 సెప్టెంబర్, 2025

ఇటీవల మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని తాము కాపాడామంటూ హైడ్రా చెప్పుకున్నది. అయితే ఈ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హైడ్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు ఓ తహసీల్దార్ కాళ్లు మొక్కుతున్న వీడియోలు.. హైడ్రా కూల్చివేతలను అడ్డుకుంటున్న వీడియోలను బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తున్నది. నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్తున్నదని కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది వందల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని తాము కాపాడామని హైడ్రా చెబుతోంది. అంతేకాక చెరువులను కాపాడామని కూడా వివరిస్తోంది. హైడ్రా కేవలం పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తోందని.. బడా బాబులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేయడం లేదన్నది బీఆర్ఎస్ ఆరోపణ.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదా?

హైడ్రాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాబోయే జూబ్లిహిల్స్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హైడ్రాపై, ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని కాంగ్రెస్ అంటున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే బుల్‌డోజర్లు రంగంలోకి దిగుతాయని, కాంగ్రెస్ పార్టీ పేదల ఇండ్లను కూల్చేస్తుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. తద్వారా పేద వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది.

హైడ్రా అధికారులు మాత్రం తాము గాజులరామారంలో రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడినట్లు ప్రకటించారు. అయితే పేదల ఇళ్లను బలవంతంగా తొలగించారని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.

ప్రభుత్వ భూమి కాపాడటంపై దృష్టి

గాజులరామారంలోని కుత్బుల్లాపూర్ మండలంలో సర్వే నంబర్ 307, 342.329/1, 348లో 100 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి (రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించినది) అక్రమంగా కొందరు ఈ భూమిని కబ్జా చేశారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. ఈ భూములను కబ్జాదారులు 60-70 గజాల ప్లాట్లుగా విభజించి, రూ. 10 లక్షలకు అమ్ముతూ వచ్చారు. సెప్టెంబర్ 21న చేపట్టిన కూల్చివేతల ద్వారా వందకుపైగా ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, ఇది రూ. 4,500 కోట్ల నుంచి 15 వేల కోట్ల విలువైన ఆస్తి అని అధికారులు చెబుతున్నారు. అక్రమ కబ్జాలపైనే కూల్చేశాం అని ప్రకటించారు.

'కొనుగోలు చేసి కట్టిన ఇల్లు... ఎందుకు కూల్చారు?'

హైడ్రా ఇటీవల గాజులరామారంలో 60 నుంచి 70 ఇండ్లను కూల్చేసింది. వీరిలో చాలామంది కూలీలు, చిన్న ఉద్యోగులున్నారు. "మేము రూ.10 లక్షలు చెల్లించి భూమి కొన్నాం, డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ఇళ్లు కూల్చేశారు" అని బాధితులు ఆరోపిస్తున్నారు. బతుకమ్మ పండుగ సమయంలో ఈ చర్య తీసుకోవడం మరింత బాధాకరమని మహిళలు ఆందోళన చేస్తూ బతుకమ్మ పాట పాడుతూ నిరసన తెలిపారు.

"కబ్జాదారులపై చర్య తీసుకోవడం మంచిదే, కానీ మేము మోసపోయిన కొనుగోలుదారులం. మా మీదే ప్రతాపం చూపిస్తున్నారు సరే.. కబ్జా చేసిన నేతల మీద ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు. వాళ్ల నుంచి డబ్బులు ఎందుకు రికవరీ చేసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే గాజులరామారంలో తాము ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టిన నిర్మాణాలనే కూల్చేశామని హైడ్రా అధికారులు ఆధారాలతో సహా వివరిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌కు ఆయుధం

బీఆర్ఎస్ పార్టీ ఈ ఘటనను రాజకీయ ఆయుధంగా మలుచుకున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ "కాంగ్రెస్‌కు ఓటు వేస్తే పేదల ఇళ్లు కూలుతాయి" అని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ భూములు ఆధీనంలోకి వచ్చాయి. అయితే కబ్జాదారుల మీద కూడా చర్యలు తీసుకొని ఉంటే అప్పుడు హైడ్రా మీద ప్రశంసలు వచ్చేవి.

మరోవైపు హైడ్రా కూల్చివేతలు మొత్తం చిన్న చిన్న ఇండ్లు, చిరు వ్యాపారుల దుకాణాలే ఉంటున్నాయి. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత అటువంటి అక్రమ నిర్మాణం ఏదీ కూల్చేయలేదు. దీంతో హైదరాబాద్‌లో బడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టిన నిర్మాణాలు అన్ని సక్రమమేనా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు కొందరు బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ఫలానా చోట అక్రమ నిర్మాణాలు చేశారని ఆధారాలు చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ అటువంటి నిర్మాణాలు ఎందుకు కూల్చడం లేదన్నది ప్రశ్న.

కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య యుద్ధం

‘హైడ్రా ద్వారా రూ.15వేల కోట్ల మోసాన్ని అరికట్టగలిగాం" అని కాంగ్రెస్ పార్టీ చెబుతుండగా.. బీఆర్ఎస్ "పేదలపైనే హైడ్రా, పెద్దలపై ఎందుకు లేదు" అని ఆరోపిస్తోంది. ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? అన్నది వేచి చూడాలి. బీఆర్ఎస్ ఈ అంశాన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. హైడ్రా చర్యలను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే పేదలకు సదరు భూములను కట్టబెట్టిన బడా బాబులపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ముందస్తు హెచ్చరికలు, కబ్జాదారులపై కఠిన చర్యలు లేకుండా చేయడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

అయితే ఒక వైపు హైదరాబాద్‌లో చెరువులు కబ్జాకు గురయ్యాయి. నాలాలు కబ్జాకు గురయ్యాయని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. కబ్జా చేసిన చోట్ల నిర్మాణాలు కూల్చేస్తుంటే మాత్రం గగ్గోలు పెడుతుంటాయి. బీఆర్ఎస్ కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే హైడ్రాను విమర్శిస్తోందని.. హైడ్రా లక్ష్యాన్ని అర్థం చేసుకున్నా ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

హైడ్రా కూల్చివేతలపై రాజకీయం - Tholi Paluku