Let's talk: editor@tmv.in
హైడ్రాకు ఎక్కువ పవర్స్ ఇవ్వండి

హైడ్రాకు ఎక్కువ పవర్స్ ఇవ్వండి

Aravind Maryada Reddy
25 సెప్టెంబర్, 2025

ఇటీవల హైడ్రా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు హైడ్రాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. హైడ్రాను అడ్డంపెట్టుకొని పేదల ఇండ్లను కూలుస్తున్నారని విమర్శిస్తున్నారు. వీడియోలు వైరల్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాజాగా ఈ విషయంపై స్పందించారు. హైడ్రాపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. హైడ్రా పనితీరును సమర్థించారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తే కబ్జా చేసిన భూములన్నీ స్వాధీనం అవుతాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

పేదలకు పంచిన భూములు, అసైన్డ్ భూములను కబ్జా చేసుకున్న అక్రమదారులను నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలంటూ కోరారు. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ చుట్టూ చాలా ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయని, అవి తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు, పేదలకు కేటాయించిన భూములు మొత్తం కబ్జాలో ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేదల భూములు కూల్చివేస్తే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేసిన వీహెచ్, అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. "పేదలు బలహీనులు కాదు, వారికి న్యాయం కావాలి. హైడ్రా ఈ విషయంలో కీలక పాత్ర పోషించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ధరణి పేరు మీద అనేక అక్రమాలు జరిగాయని కూడా ఆయన ప్రస్తావించారు. ధరణిని అడ్డుపెట్టుకొని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములు కూడా స్వాధీనం చేసుకోవాలన్నది వీహెచ్ డిమాండ్

విపక్షాల రాద్ధాంతం

విపక్షాలు హైడ్రా విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని.. వాళ్ల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. "విపక్షాలు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సహకరించకుండా రాజకీయం చేస్తున్నాయని వీహెచ్ విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కబ్జాకు గురైన భూములను హైడ్రా కాపాడుతోందన్నారు. అయితే పేదల ఇండ్లను మాత్రమే కూలుస్తున్నారని.. బడా బాబులు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదన్నది విపక్షాల ప్రశ్న. హైడ్రా పనితీరుపై విమర్శలు ఆగడం లేదు. నోటీసు ఇచ్చిన మరునాడే నిర్మాణాలు కూల్చివేయడం ద్వారా ప్రజల హక్కులు ఉల్లంఘించారని తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. హైడ్రా పనితీరు పేదలు, మధ్యతరగతి వర్గాలపై ఎక్కువ ప్రభావం పడుతోందని.. రాజకీయంగా బలంగా ఉన్నావారు, ధనవంతుల ఆస్తులను వదిలేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఒవైసీ సోదరులకు చెందిన ఓ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు రఘునందనరావు, ఈటల రాజేందర్ వంటి వారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుపట్టారు.

ప్రారంభంలో హైడ్రాపై ప్రశంసలు

హైడ్రా ప్రారంభంలో ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేసినప్పుడు అంతా హైడ్రాను మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల నిర్మాణాలను, సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న పేదల గుడిసెలు, చిన్న ఇండ్లు కూల్చినప్పుడు హైడ్రా పనితీరు మీద విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుంటున్నది. అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చేస్తోంది. అంతేకాకుండా చెరువులను కాపాడుతోంది. అయితే గతంలో ఈ భూములకు ప్రభుత్వ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ టీఎల్ పరిధిలో, లేదంటే బఫర్ జోన్ లో ఉన్న స్థలాలకు గతంలో రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? అక్కడ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ ఎందుకు అనుమతులు ఇచ్చింది. అటువంటి వివాదాస్పద భూములకు విద్యుత్ సౌకర్యం, మంచి నీటి సౌకర్యం ప్రభుత్వం ఎలా కల్పించింది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టు కూడా పలుమార్లు దీన్ని ప్రశ్నించింది. పేదల ఇండ్లు, నిర్మాణాలు కూల్చివేయడంతోపాటు గతంలో అనుమతులు ఇచ్చిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఇండ్లు కూడా అక్రమ నిర్మాణాలుగా ఉంటే వాటిని ఎందుకు కూల్చేయడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి. హైడ్రా పారదర్శకత మీద కొన్ని అనుమానాలున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తే ఏం జరగబోతున్నది? అన్న చర్చ కూడా సాగుతోంది. వీహెచ్ డిమాండ్ చేసినట్టుగా హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తారా? అన్నది వేచి చూడాలి.

హైడ్రాకు ఎక్కువ పవర్స్ ఇవ్వండి - Tholi Paluku