Let's talk: editor@tmv.in
హజ్ యాత్ర 2026: నిజాం రుబాత్ కింద 695 మంది యాత్రికుల ఎంపిక

హజ్ యాత్ర 2026: నిజాం రుబాత్ కింద 695 మంది యాత్రికుల ఎంపిక

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

పవిత్ర హజ్ యాత్ర-2026కు సంబంధించి ‘నిజాం రూబాత్‌’ సౌకర్యం కింద ఎంపిక ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. పూర్వపు హైదరాబాద్ సంస్థాన యాత్రికుల కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో మొత్తం 695 మంది హజ్‌ యాత్రికులు ఎంపికైనట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

హెచ్‌.ఈ‌.హెచ్‌. నిజాం కమిటీ సభ్యుడు ఫైజ్ ఖాన్ మాట్లాడుతూ, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు, హజ్‌ కమిటీ సభ్యులు, వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు, సౌదీ అధికార ప్రతినిధి హుస్సేన్ అల్ షరీఫ్ సమక్షంలో డ్రా నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైన యాత్రికుల్లో నిజాం రాజ కుటుంబ సభ్యులు, హెచ్‌.ఈ‌.హెచ్‌. నిజాం ట్రస్టులకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారని చెప్పారు.

మక్కా నగరంలో ఉన్న చారిత్రాత్మక నిజాం రూబాత్‌లో ఈ యాత్రికులకు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. హజ్‌ యాత్ర సమయంలో యాత్రికులకు సౌకర్యవంతమైన నివాసం అందించడం మాత్రమే కాకుండా, ఆర్థిక భారం తగ్గించడంలో కూడా ఈ ఏర్పాటు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ సంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తోందని, దీనిని భవిష్యత్ తరాలకు అందించేందుకు కమిటీ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

చారిత్రక వారసత్వం

ఈ విశిష్టమైన సేవను మొదటగా ఐదవ నిజాం ప్రారంభించగా, అనంతరం ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకర్రమ్ జాహ్ బహదూర్ దీన్ని మరింత బలపరిచారని ఫైజ్ ఖాన్ తెలిపారు. భవిష్యత్తులో యాత్రికులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు మదీనా నగరంలో కూడా రూబాత్ సదుపాయాలను పునరుద్ధరించడం లేదా కొత్తగా ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఎంపికైన హజ్ యాత్రికులందరికీ సురక్షితమైన, శుభప్రదమైన యాత్ర జరగాలని శుభాకాంక్షలు తెలిపారు.

హజ్ యాత్ర

ఇస్లాం మతంలో ప్రతి ముస్లిం తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఐదు ప్రధాన కర్తవ్యాల్లో హజ్ ఒకటి. సాధారణంగా కఠిన వాతావరణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 25 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉండటంతో హజ్ యాత్ర శారీరకంగా కఠినమైనదిగా భావిస్తారు. 2025లో హజ్ యాత్ర జూన్ 4 నుంచి జూన్ 9 వరకు సౌదీ అరేబియాలో నిర్వహించబడింది. అదే ఏడాది భారత్ నుంచి మొదటి విడత యాత్రికులు మే ప్రారంభంలోనే బయలుదేరారు.

కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపిన వివరాల ప్రకారం, 2025లో భారత్ నుంచి మొత్తం 1,22,518 మంది హజ్ యాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం భారత్ ప్రభుత్వం, సౌదీ అరేబియా మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం సీట్ల కేటాయింపు జరుగుతుంది. అందులో భాగంగా భారత్‌కు కేటాయించే హజ్ కోటా నిర్ణయించబడుతుంది. అందులో 70 శాతం సీట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు, మిగిలిన 30 శాతం హజ్ గ్రూప్ ఆర్గనైజర్లకు కేటాయించబడతాయి.