
హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు
2026 హజ్ యాత్రకు వెళ్లే దరఖాస్తుదారులకు సంబంధించి తప్పనిసరి ఆరోగ్య తనిఖీలు, టీకాలు వేసే ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు ఈనెల 9 (సోమవారం) వరకు కొనసాగుతాయని ఆ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలవారీగా ఏర్పాట్లు
యాత్రికుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, శ్రీ సత్యసాయి, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ శిబిరాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
ఆరోగ్య ధ్రువీకరణ తప్పనిసరి
హజ్ యాత్రకు వెళ్లే ప్రతి దరఖాస్తుదారు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షల సమయంలో వైద్యపరంగా పూర్తి ఆరోగ్యంతో యాత్రకు అనుకూలంగా ఉన్నట్లు (ఫిట్‌నెస్) తేలిన యాత్రికులకు మాత్రమే టీకాలు వేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2,000 మంది యాత్రికులు పవిత్ర హజ్ యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా పరీక్షలు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
