Let's talk: editor@tmv.in
హెచ్1బీ వీసా రుసుముతో అమెరికాకే న‌ష్టం!

హెచ్1బీ వీసా రుసుముతో అమెరికాకే న‌ష్టం!

FL - SUNL
21 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాల రుసుము ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచిన నేప‌థ్యంలో తీవ్ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. హెచ్1బీ వీసాల రుసుము పెర‌గ‌డంతో ఐటీ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయ‌న్న వాద‌న వినిస్తోంది. అయితే భార‌త్ టాప్ ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని క్ర‌మంగా త‌గ్గిస్తున్నాయ‌ని తెలుస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో,టెక్ మ‌హీంద్రాలు హెచ్1బీ వీసాల‌పై ఆధార‌ప‌డటాన్ని 20 శాతం నుంచి 50 శాతంలోపు త‌గ్గించాయి. 2015 ఆర్థిక సంవ‌త్స‌రం 2023 ఆర్థిక సంవ‌త్సరాల మ‌ధ్య టాప్ ఐటీ సంస్థ‌ల హెచ్1బీ వీసాల పిటిష‌న్లు 56 శాతం మేర త‌గ్గిన‌ట్టు తెలుస్తోంది. హెచ్1బీ వీసాల‌పై ఆధార‌ప‌డటాన్ని త‌గ్గించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, 50 శాతం కంటే ఎక్కువగా స్థానిక ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి.

విదేశీ నిపుణుల‌కు అమెరికా ప్రాజెక్టుల్లో ప‌ని చేయ‌డానికి టెక్ కంపెనీలు హెచ్1బీ వీసాను వినియోగిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాల‌పై ఆధార‌ప‌డ‌టాన్ని త‌గ్గించాయి. అదే స‌మ‌యంలో వీసాల‌పై ఆధార‌ప‌డ‌టం త‌గ్గుతున్నా ద‌ర‌ఖాస్తులు మాత్రం పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో హెచ్1బీ వీసాల ద‌ర‌ఖాస్తులు 3.1 శాతం పెరిగితే, ఆమోదం పొందిన ద‌ర‌ఖాస్తుల శాతం 4 వ‌ర‌కు పెరిగింది. 2023తో పోల్చితే 32.5 శాతం త‌గ్గుద‌ల ద‌ర‌ఖాస్తుల తిరస్క‌ర‌ణ‌లో క‌నిపించిన‌ట్టు యూఎస్సీఐఎస్ డేటా చెబుతోంది. అంతర్జాతీయంగా డిజిట‌ల్ ట్రాన్స‌ఫ‌ర్మేష‌న్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబ‌ర్ సెక్యురిటీ , అమెరికాలోని నిపుణుల కొర‌త హెచ్1బీ వీసాల ద‌ర‌ఖాస్తులు పెర‌గ‌డానికి కార‌ణంగా నిపుణులు అభిప్రాయ‌డుతున్నారు.

అమెరికాలోని పెద్ద ఐటీ కంపెనీలే హెచ్1బీ వీసా వినియోగ‌దారులు అన్న‌ది నిపుణులు అభిప్రాయం. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం అమెరికా కంపెనీల‌కు పెనుభారంగా మారుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే చాలా వ‌ర‌కు హెచ్1బీ వీసా రుసుమును సంబంధిత కంపెనీలే విదేశీ నిపుణుల‌కు చెల్లిస్తున్నాయి. అందుకే ఇది కంపెనీక‌లకు భారంగా మారుతోంది. డేటా సైంటిస్టులు, ఏఐ ఇంజినీర్లు వంటి విశేష ప్ర‌తిభ క‌లిగిన విదేశీ నిపుణుల విష‌యంలో కంపెనీలు హెచ్1బీ వీసాల‌ను ఉప‌యోగిస్తున్నాయి. దీనికి అమెరికాలో ఉన్న‌టువంటి నిపుణుల కొర‌త కార‌ణ‌మ‌న్న‌ది అంచ‌నా. భార‌త ఐటీ కంపెనీల‌కు ఈ హెచ్1బీ వీసాల రుసుము స్వ‌ల్ప కాలంలో లాభాల మార్జిన్ల‌పై ఒత్తిడిని క‌లిగిస్తుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

హెచ్1బీ వీసాల‌పై ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం అమెరికానే ఉక్కిరిబిక్కిరి చేస్తుంద‌ని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈ రుసుము అమెరికా ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఊపిరి ఆడ‌కుండా చేస్తుంద‌ని అభిప్రాయ‌పడ్డారు. భార‌త్ లోని ప్ర‌పంచ స్థాయి ప్ర‌తిభ‌కు త‌లుపులు మూయ‌డం ద్వారా భార‌త్ కు మేలు జ‌రుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. అమెరికాలో ఏర్ప‌డాల్సిన‌ ల్యాబ్లు, పేటెంట్లు, ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట‌ప్ లు బెంగ‌ళూరు,పూణే, హైద‌రాబాద్ లాంటి న‌గ‌రాల్లో ఏర్ప‌డుతాయ‌న్నారు. హెచ్1బీ వీసా రుసుము నిర్ణ‌యం అమెరికాకు న‌ష్టం క‌లిగించి భార‌త్ కు మేలు చేస్తాయ‌ని తెలిపారు.

హెచ్1బీ వీసా రుసుముతో అమెరికాకే న‌ష్టం! - Tholi Paluku