Let's talk: editor@tmv.in
హెచ్‌1బీ వీసాపై గంద‌ర‌గోళానికి స్వ‌స్తి!

హెచ్‌1బీ వీసాపై గంద‌ర‌గోళానికి స్వ‌స్తి!

Venkatesh Balusula
22 సెప్టెంబర్, 2025

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసా ద‌ర‌ఖాస్తుల రుసుము ల‌క్ష డాలర్లకు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది అమెరికాలో గ‌త ద‌శాబ్దాల్లో వీసా విధానంలో జరిగిన భారీ మార్పుల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ నిర్ణయం భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రతి సంవత్సరం జారీ చేసే హెచ్‌1బీ వీసాలలో దాదాపు 71 శాతం వరకు భారతీయులే పొందుతున్న నేపథ్యంలో ఇది భార‌తీయుల‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కొత్త ఫీజు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వ‌చ్చింది. ట్రంప్ అక‌స్మాత్తుగా తీసుకున్న నిర్ణ‌యంతో దీనిపై తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో వైట్ హౌస్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఇది ప్రస్తుత వీసా క‌లిగి ఉన్న వారికి వర్తించద‌ని, కేవలం కొత్తగా ద‌ర‌ఖాస్తు చేసే వారికే వర్తించనుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

అధికారులు ఏం చెప్పారంటే...

హెచ్‌1బీ వీసాల ద‌ర‌ఖాస్తు రుసుము పెంపుపై విధివిధానాల‌న్నీ ముందుగానే నిర్ణ‌యించారు. రుసుము పెంపు విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించిన అనంత‌రం ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దేందుకు వైట్ హౌస్ మెమోరాండం విడుద‌ల చేసింది. ఇందులో హెచ్‌1బీ వీసా ముసాయిదా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లోని సెక్షన్లు 212(ఎఫ్), 215(ఏ) ప్రకారం, 2025 సెప్టెంబర్ 21 తెల్లవారుజాము తరువాత దాఖలయ్యే హెచ్‌1బీ వీసా దరఖాస్తులపై ల‌క్ష డాల‌ర్ల‌ ఫీజు తప్పనిసరి అని తెలిపారు. ఈ మార్గదర్శకాలు కేవలం కొత్తగా దాఖలవుతున్న వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తాయ‌ని, 2025 సెప్టెంబర్ 21కు ముందు వీసా దరఖాస్తులు చేసుకున్న వారికి వ‌ర్తించ‌వ‌ని తెలిపారు. అలాగే ఇప్పటికే అంగీకరించబడిన వీసా దరఖాస్తులు, ప్రస్తుతం చెల్లుబాట‌య్యే హెచ్‌1బీ వీసాలు కలిగి ఉన్నవారు అమెరికాకు రావడంలో లేదా ఇక్క‌డి నుంచి వెళ్లడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌న్నారు.

భారత రాజకీయ, వాణిజ్య ప్ర‌ముఖుల స్పంద‌న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే అమెరికా అధికారులతో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ అమెరికా భారతీయులకు వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. పలు ప్రతిపక్ష నేతలు భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం దేశ ప్రయోజనాలకు తగద‌ని విమర్శించారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర‌ ప్రభుత్వం దీనిపై స‌రిగా స్పందించ‌డం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు కూడా దీనిపై స్పందించారు. నాస్‌కామ్ మాజీ ఛైర్మన్ ఈ నిర్ణయం తాత్కాలికంగానే ఇబ్బందులు తలపెడుతుంద‌ని, దీని వ‌ల్ల భార‌త ఐటీ సంస్థలు అమెరికాలో స్థానికంగా ఉద్యోగులను నియ‌మించ‌డం, గ్లోబల్ డెలివ‌రీ మోడ‌ళ్ల‌ను బ‌ల‌ప‌ర‌చ‌డం వంటి మార్గాల‌ను అన్వ‌యించుకోవ‌చ్చని అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికాలోని వాణిజ్య వర్గాలు ఈ ఫీజు నిబంధన వల్ల కంపెనీలు, ఉద్యోగులు, కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతారని తెలిపాయి. దీనిని తిరిగి ప‌రిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి దిగ్గజాలు తమ ఉద్యోగులకు దేశం వెలుపలకు ప్రయాణించొద్దని సూచించాయి. ఈ మార్పుల కారణంగా తాత్కాలికంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. ఈ పరిణామంతో భారత్, అమెరికా మధ్య విమాన టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి. గ్లోబల్ ఐటీ టాలెంట్‌పై ఆధారపడే సంస్థలు ఈ నిర్ణయం వల్ల భారీ నష్టాల బారిన పడతాయంటున్నాయి.

నేటి నుంచి అమెరికాతో భార‌త్ చ‌ర్చ‌లు

భారత విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ ఈ నిర్ణ‌యంతో కుటుంబ వేర్పాటు వంటి మానవతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కార మార్గాలు వెతుకుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో అధికారులతో చర్చలు జరపనున్నారు. అమెరికాలో నైపుణ్యం ఉన్న విదేశీ కార్మికులపై ఆధారపడకూడదని, అమెరికన్ ఉద్యోగుల‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్‌ ఈ ఫీజుతో కంపెనీలు తమ ప్రాధాన్యతల‌ను పునః పరిశీల‌న చేయాల్సిన‌ అవసరం ఉందన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా వ‌ల‌స‌ల విధానంలో సంచ‌ల‌న మార్పుగా తెలుస్తోంది. భారతీయుల‌పైనే దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంద‌నే స్ప‌ష్టమ‌వుతోంది. ముఖ్యంగా దేశంలోని యువ ఐటీ నిపుణుల‌కు అమెరికా ఉద్యోగం క‌ల‌గానే మిగిలిపోనుంది. ఈ విధానం ఇలాగే కొనసాగితే భ‌విష్య‌త్తులో భారత ఐటీ సంస్థలు స్థానిక నియామకాల‌ను పెంచాల్సి వస్తుంది. ఇది వృత్తిపరంగా ఒత్తిడి పెంచినా, దీర్ఘకాలంలో దేశీయ ఉపాధి అవకాశాల‌కు తోడ్పడుతుంది. అమెరికా, భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల ప్ర‌భుత్వాలు దీన్ని ఎలా ప‌రిష్కారిస్తాయ‌న్న‌దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

హెచ్‌1బీ వీసాపై గంద‌ర‌గోళానికి స్వ‌స్తి! - Tholi Paluku