Let's talk: editor@tmv.in
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
22 జులై, 2026

వికారాబాద్ జిల్లా హకీంపేటలో నిర్మాణంలో ఉన్న ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా పనుల పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని, అవసరమైతే నెలకు ఒక రోజు నిర్మాణ స్థలంలోనే బస చేసి పనులను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.

హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌ను సందర్శించిన సీఎం, అక్కడ నిర్మాణంలో ఉన్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలతో పాటు విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే విద్యా సంస్థల భవనాల నిర్మాణం, అంతర్గత రహదారులు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతి నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని అవసరమైతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడవద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల పంపిణీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, వచ్చే వారంలోగా లబ్ధిదారులకు ప్లాట్ల పట్టాలు అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.