Let's talk: editor@tmv.in
హాంకాంగ్‌ను వ‌ణికించిన ర‌గాసా!

హాంకాంగ్‌ను వ‌ణికించిన ర‌గాసా!

Venkatesh Balusula
25 సెప్టెంబర్, 2025

ఫిలిప్పీన్స్‌లో మొద‌లైన సూప‌ర్ టైఫూన్ ర‌గాసా తైవాన్‌, చైనాలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ప్రాంతంతో పాటు, ప్ర‌పంచంలో ఈ ఏడాది వ‌చ్చిన తుఫాన్ల‌లో అత్యంత శ‌క్తివంత‌మైన తుఫాన్ ఇదేన‌ని అధికారులు వెల్ల‌డించారు. హాంకాంగ్‌ను హరికేన్ లాంటి గాలులతో పాటు భారీ వర్షాలు అత‌లాకుత‌లం చేశాయి. తైవాన్‌లో భారీ వర్షాల వల్ల 14 మంది మరణించారు. తైవాన్ తూర్పు హువాలియన్ కౌంటీలో బారియర్ లేక్ పొంగి ప్రవహించింది. పట్టణమంతా నీటితో నిండిపోయింది. రగాసా సోమవారం నుంచి తైవాన్‌ను తాకింది. దీంతో ఇక్క‌డ‌ భారీ వర్షాలు కురిశాయి. ముంద‌స్తుగానే అధికారులు చైనాకు తుఫాన్ హెచ్చ‌రిక జారీ చేశారు. హాంకాంగ్‌లో భారీ అలలు తూర్పు, దక్షిణ తీరాలను తాకాయి. కొన్ని రోడ్లు, నివాస‌ ప్రాంతాలు మునిగిపోయాయి. ఫులర్టన్ హోటల్‌లోకి సముద్ర నీరు ప్ర‌వేశించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

భ‌యం గుప్పిట్లో గ్వాంగ్‌డాంగ్‌

ర‌గాసా ప్ర‌భావంతో ఈదురుగాలులు, భారీ వ‌ర్షాల‌తో లంటౌ ద్వీపంలో భారీ వరదలు వచ్చాయి. బీచ్‌లు మునిగిపోయాయి. ఇక్క‌డే అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. దీంతో అధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. తుఫాన్ తాకిడితో ఆయా ప్రాంతాల్లో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్ర‌స్తుతం చైనా గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ వైపు వెళ్తుంది. ఇది 125 మిలియన్ల ప్ర‌జ‌లు నివ‌సించే ప్రాంతం. దీంతో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయోన‌న్న భ‌యం నెల‌కొంది. బుధ‌వారం మధ్యాహ్నం నుంచి తుఫాన్ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంది. రగాసా సోమవారం ఉత్తర ఫిలిప్పీన్స్‌ను తాకింది. మంగళవారం తైవాన్‌ను తాకింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌తో సూప‌ర్ మార్కెట్ల‌లో జనం రద్దీ తీవ్ర‌మైంది. కొన్ని చోట్ల గంటల కొద్దీ క్యూలో ఉండాల్సి వ‌స్తోంది. తుఫాన్ భ‌యంతో ప్ర‌జ‌లు గాజు కిటికీల‌కు ర‌క్ష‌ణ‌గా ద‌ట్ట‌మైన‌ టేపులు అంటించి పెట్టుకుంటున్నారు. గ్వాంగ్‌డాంగ్‌లో 7,70,000 మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. పాఠ‌శాల‌లు మూసివేశారు. ర‌వాణాపై తీవ్ర ఆంక్ష‌లు విధించారు. హైస్పీడ్ రైళ్ల‌ను నిలిపివేశారు. గ్వాంగ్‌జౌ, షెన్‌జెన్ విమానాశ్ర‌యాల్లో విమానాలు ర‌ద్ద‌య్యాయి.

చైనా మెరైన్ అథారిటీ రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

హాంకాంగ్‌లో ప‌దో హెచ్చ‌రిక

హాంకాంగ్ అధికారులు ఇప్ప‌టికే 10వ హెచ్చ‌రిక జారీ చేశారు. వ్యాపారాలు, ర‌వాణాను పూర్తిగా నిలిపివేయాల‌ని ఆదేశించారు. భారీ వర్షాలు కొనసాగుతాయ‌ని చెప్పారు. కొన్ని వీధులు ఇప్పటికే మునిగిపోయాయి. 2017లో హాటో తుఫాన్‌, 2018 మంగ్‌ఖుట్ తుఫాన్ వంటివి దేశానికి బిలియన్ల డాలర్ల నష్టం చేశాయి. మంగళవారం ఒక మహిళ, ఆమె ఐదేళ్ల కుమారుడితో క‌లిసి వాటర్‌ఫ్రంట్‌కు వెళ్లగా సముద్రంలోకి కొట్టుకుపోయారు. వెంట‌నే స్పందించిన భ‌ద్ర‌తా సిబ్బంది వారిని ర‌క్షించారు. ప్రభుత్వం 49 తాత్కాలిక శిబిరాల‌ను ఏర్పాటు చేసింది. సుమారు 727 మంది అక్కడ ఉన్నారు. హాంకాంగ్ స్టాక్ ఎక్స్‌చేంజ్ తెరిచే ఉండ‌నుంది. గత సంవత్సరం నిర్ణ‌యించిన విధానాల ప్ర‌కారం వాతావ‌ర‌ణంలో ఎలాంటి మార్పులున్నా ట్రేడింగ్ కొనసాగుతుంది. మకావులో క్యాసినోలు మూసివేశారు.

భార‌త్‌పై ప్ర‌భావం?

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చైనా వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో తుఫాన్ హెచ్చ‌రిక‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకుండా సుర‌క్షితంగా ఇంట్లోనే ఉండ‌టం ఉత్త‌మం. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్ల‌డం శ్రేయ‌స్క‌రం. ఎన్ని రోజులు ఇలాంటి ప‌రిస్థితులు ఉంటాయో తెలియ‌డం లేదు కాబ‌ట్టి ముంద‌స్తుగా ఆహారం, నీరు సేక‌రించుకోవాలి. అత్యవసర ఆరోగ్య పరికరాలు సిద్ధం చేసుకోవాలి. తీర ప్రాంతాలకు వెళ్లకూడదు. ప్రభుత్వ హెచ్చరికల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. చైనాపై ఈ తుఫాన్ భారీ ఎత్తున ఆర్థిక ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. ప‌ర్యాట‌క శాఖ తీవ్రంగా దెబ్బ‌తింటుంది. మ‌రింత ఆర్థిక, ప్రాణ న‌ష్టానికి అవ‌కాశం ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ సూపర్ టైఫూన్ రగాసా పసిఫిక్ మ‌హా స‌ముద్రంలో ఉంది. ఇది ఫిలిప్పీన్స్ నుంచి చైనా, హాంకాంగ్ వైపు వెళ్తోంది. భారత్ హిందూ మహా సముద్ర ప్రాంతంలో ఉంది. భారత్‌పై నేరుగా ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవ‌కాశం లేదు. కానీ, వాణిజ్య ప‌రంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది. స్టాక్ మార్కెట్ ప్రభావం. చైనా ర‌వాణా, దిగుమ‌తుల్లో ఆల‌స్యం అవ‌డం వంటివి జ‌ర‌గ‌వ‌చ్చు.

దిగుమతులు ఆలస్యమైతే జరిగే పరిణామాలు

భారత్, చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతులు చేసుకుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మ‌ధ్య‌ దాదాపు 99.2 బిలియన్ డాలర్ల వ్యాపారం జ‌రిగింది. చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, మిషినరీ, ఫార్మా ముడి స‌రుకులు, ఎరువులు, కీట‌క నాశ‌కాలు, ఆటోమొబైల్ రంగంలో విడి భాగాలు వంటి వస్తువుల‌పై భార‌త్ ఆధార‌ప‌డి ఉంది. తుఫాన్ ప్ర‌భావంతో ఈ ఉత్ప‌త్తుల ర‌వాణా ఆల‌స్య‌మైతే భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌పై గణనీయ ప్రభావాలుంటాయి. ఇవి ర‌వాణా గొలుసుల‌ను ప్ర‌భావితం చేసి ధ‌ర‌ల పెంపున‌కు కార‌ణ‌మ‌వుతాయి. చైనా నుంచి ముడిస‌రుకుల ర‌వాణా ఆల‌స్య‌మైతే భారత కంపెనీలు ఉత్పత్తి నిలిపి వేస్తాయి. భారత్‌లో ఇది చిన్న సంస్థ‌ల మూసివేత‌కు కూడా దారితీయ‌వ‌చ్చు. ఫ‌లితంగా ఆయా సంస్థ‌ల్లో కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారు. తుఫాన్ తీవ్ర‌మైతే భార‌త్‌కూ న‌ష్టం త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో భార‌త్ ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి. వియత్నాం, ఇండోనేషియా నుంచి దిగుమ‌తులు పెంచుకోవాలి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ముందు జాగ్ర‌త్త‌ చ‌ర్య‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి.

హాంకాంగ్‌ను వ‌ణికించిన ర‌గాసా! - Tholi Paluku