
‘హండ్రెడ్’ లీగ్ వేలం: సన్‌రైజర్స్ నిర్ణయంపై దుమారం
ఇంగ్లాండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్' క్రికెట్ టోర్నీ వేలంలో భారత ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి దారి తీసింది. పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సుమారు ₹2.34 కోట్లు వెచ్చించి సన్ గ్రూప్ యాజమాన్యంలోని ఈ జట్టు దక్కించుకుంది. 2009 నుంచి ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లపై అనధికారిక నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒక భారత ఫ్రాంచైజీ పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. దీంతో క్రీడా వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అభినందన్ మీమ్ వివాదం.. నిరసన సెగ
అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడం వెనుక కేవలం రాజకీయ కారణాలే కాకుండా, అతడి పాత సోషల్ మీడియా పోస్టులు కూడా వివాదానికి ఆజ్యం పోశాయి. 2019లో పాక్‌కు చిక్కిన భారత విమాన పైలెట్ అభినందన్ వర్థమాన్‌ను ఎగతాళి చేస్తూ అబ్రార్ గతంలో ఒక 'మీమ్'ను షేర్ చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. భారత సైన్యాన్ని కించపరిచిన వ్యక్తిని భారతీయ యాజమాన్యమే కోట్ల రూపాయలు ఇచ్చి కొనడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఎస్‌ఆర్‌హెచ్ హ్యాష్‌ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఐపీఎల్‌లోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను సైతం బహిష్కరించాలంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు
వేలంలో అబ్రార్‌తో పాటు మరో పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ రూ.1.72 కోట్లకు దక్కించుకుంది. అయితే హారిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కొనేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపలేదు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేలం నుంచి ముందే తప్పుకోగా, మహిళల వేలంలో పాక్ క్రీడాకారిణులు ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ అమ్ముడుపోలేదు. మరోవైపు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను బర్మింగ్‌హామ్ జట్టు రూ.1.23 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ వేలంలో ససెక్స్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా రూ.4.8 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
