Let's talk: editor@tmv.in
హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ 'ఆపరేషన్ పీఠం'

హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ 'ఆపరేషన్ పీఠం'

Gaddamidi Naveen
17 ఫిబ్రవరి, 2026

తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల రాజకీయం ముదిరింది. హంగ్ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కిడ్నాప్‌లు, పోలీసు బలగాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఎనిమిది కీలక మున్సిపాలిటీలకు పార్టీ సీనియర్ నేతలను ప్రత్యేక ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక పార్టీ నేతలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ సమీక్షించారు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్థానికంగా అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు, పోలీసుల దుర్వినియోగం వంటి చర్యలకు పాల్పడుతున్నదన్న ఆరోపణలను ఆయన అడిగి తెలుసుకున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయాలనే ప్రయత్నాలను పార్టీ గమనిస్తున్నదని, అలాంటి పరిస్థితుల్లో స్థానిక నాయకత్వానికి బీఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలన్నదే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్, పరిస్థితులను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన నేతలను బాధ్యతలు అప్పగించింది.

మున్సిపాలిటీల వారీగా ఇన్‌ఛార్జుల జాబితా

• తొర్రూర్: ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి.

• జనగామ: డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

• ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.

• జహీరాబాద్: ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి.

• కాగజ్ నగర్: మాజీ మంత్రి జోగు రామన్న.

• ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.

• క్యాతనపల్లి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి.

• ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

పార్టీ ఆదేశాల మేరకు సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక స్థాయిలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ చర్యలు తమ విజయాన్ని అడ్డుకోలేవని బీఆర్‌ఎస్ నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది.