Let's talk: editor@tmv.in
హంగేరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్ స్జలేకు ‘బుకర్ ప్రైజ్'

హంగేరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్ స్జలేకు ‘బుకర్ ప్రైజ్'

Shaik Mohammad Shaffee
12 నవంబర్, 2025

సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలలో ఒకటైన బుకర్ ప్రైజ్ 2025ను హంగేరియన్‌-బ్రిటీష్ రచయిత డేవిడ్ స్జలే గెలుచుకున్నారు. ఆయన రాసిన నవల ‘ఫ్లెష్’కు గాను లండన్‌లో సోమవారం రాత్రి జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రకటించారు.

డేవిడ్ స్జలే (51) రచించిన ‘ఫ్లెష్’ నవల భావోద్వేగాల నుండి దూరంగా ఉండే ఒక సాధారణ వ్యక్తి చుట్టూ అల్లుకున్న కథ. తన నియంత్రణకు మించిన సంఘటనల పరంపర ఆ వ్యక్తి జీవితాన్ని ఎలా విచ్ఛిన్నం చేసిందనేది నవల ప్రధానాంశం.

డేవిడ్ స్జలేకి గత ఏడాది బుకర్ విజేత సమంతా హార్వే 50,000 పౌండ్లు (సుమారు రూ.58 లక్షలు) నగదు బహుమతి, ట్రోఫీని అందజేశారు. బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతలు ‘ఫ్లెష్’ నవలను "అత్యంత తక్కువైన గద్యంతో రాసినా, ఈ ఉద్రిక్తత, ఆకర్షణీయమైన పుస్తకం ఒక మనిషి జీవితాన్ని అద్భుతంగా కదిలించే చిత్రణగా మారింది" అని కొనియాడారు.

2025 బుకర్ ప్రైజ్ చైర్ ఆఫ్ జడ్జెస్, ఐరిష్ నవలా రచయిత రోడీ డోయల్ మాట్లాడుతూ, ‘ఫ్లెష్’ ప్రత్యేకత దాని ఏకత్వం అని, "ఇది ఇతర పుస్తకాల మాదిరిగా లేదు. ఇది చీకటితో కూడిన పుస్తకం అయినప్పటికీ, చదవడం మా అందరికీ ఆనందాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. ఈ నవల సాధారణ, శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తి జీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందని తెలిపారు.

51 ఏళ్ల డేవిడ్ స్జలే తుది పోరులో ఐదుగురు బలమైన పోటీదారులను అధిగమించి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 153 నవలలు ఈ ప్రైజ్ కోసం పోటీ పడగా, సుదీర్ఘ చర్చల అనంతరం 'ఫ్లెష్' ఏకగ్రీవంగా ఎంపికైంది.

ఈ ఏడాది బుకర్ రేసులో భారతీయ సంతతికి చెందిన ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ నిరాశ చెందారు. ఆమె నవల ‘ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నప్పటికీ, విజయం సాధించలేకపోయింది. కిరణ్ దేశాయ్ 2006లో తన ‘ది ఇన్‌హెరిటెన్స్ ఆఫ్ లాస్’ నవలకి బుకర్ గెలుచుకున్నారు. ఈసారి గెలిచి ఉంటే, బుకర్ ప్రైజ్ 56 ఏళ్ల చరిత్రలో రెండుసార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న ఐదవ డబుల్ విన్నర్‌గా ఆమె చరిత్ర సృష్టించే అవకాశం ఉండేది.

667 పేజీలు ఉన్న దేశాయ్ నవలను న్యాయనిర్ణేతలు "ప్రేమ-కుటుంబం, భారతదేశం- అమెరికా, సంప్రదాయం, ఆధునికతలకు సంబంధించిన ఒక ఇతిహాసం"గా అభివర్ణించారు. "కులం, జాతి, దేశభక్తి గురించి లోతైన ఆలోచనలతో నిండిన ఈ పుస్తకం అన్నీ కలిగి ఉంది" అని ప్రశంసించారు. ఈ నవల గురించి కిరణ్ దేశాయ్ మాట్లాడుతూ, "ప్రపంచీకరణ చెందిన నేటి ప్రపంచంలో, రెండు భిన్నమైన దిశలలో ప్రయాణించే ప్రేమకథ ద్వారా ప్రపంచంలోని ఒంటరితనాన్ని గురించి రాయాలనుకున్నాను" అని తెలిపారు. ఈ కథ ఇద్దరు యువ భారతీయులు సోనియా- సన్నీ చుట్టూ తిరుగుతుంది.

ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం షార్ట్‌లిస్ట్‌ అయిన రచనలలో అమెరికన్ కొరియన్ రచయిత్రి సుసాన్ చోయ్ రాసిన 'ఫ్లాష్‌లైట్', అమెరికన్ జపనీస్ రచయిత్రి కేటీ కిటమురా రాసిన 'ఆడిషన్', బ్రిటిష్ అమెరికన్ బెన్ మార్కోవిట్స్ రాసిన 'ది రెస్ట్ ఆఫ్ అవర్ లైవ్స్', ఇంగ్లీష్ నవలా రచయిత ఆండ్రూ మిల్లర్ రాసిన 'ది ల్యాండ్ ఇన్ వింటర్' ఉన్నాయి. షార్ట్‌లిస్ట్‌ అయిన ఈ రచయితలందరికీ 2,500 పౌండ్లు నగదు, వారి పుస్తకం ప్రత్యేకంగా బైండ్ చేయబడిన ఎడిషన్ లభిస్తుంది. బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో రోడీ డోయల్ తో పాటు రచయితలు అయోబామి అడేబాయో, క్రిస్ పవర్, కైలీ రీడ్, నటి, నిర్మాత సారా జెస్సికా పార్కర్ ఉన్నారు.

బుకర్ ప్రైజ్ గురించి

ఆంగ్లంలో రాసిన నవలలకు బుకర్ ప్రైజ్‌ను 1969 నుంచి ఏటా ప్రదానం చేస్తున్నారు. ఈ ప్రైజ్‌కు కేవలం ఆంగ్లంలో రాసిన నవలలనే పరిగణనలోకి తీసుకుంటారు. మొదటగా ఈ పురస్కారం యూకే, ఐర్లాండ్, కామన్‌వెల్త్ దేశాల రచయితలకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ 2014లో అమెరికా రచయితలకూ అర్హత కల్పించారు.

ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్: ఇతర భాషల్లో రాసి, ఆంగ్లంలోకి అనువాదం చేయబడిన నవలలకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ను ప్రకటిస్తారు. ఈ ఏడాదికి గానూ, కన్నడ రచయిత్రి భాను ముస్తాక్‌ ‘హార్ట్‌ ల్యాంప్‌’ అనే చిన్న కథల సంకలనానికి గాను ఇంటర్నేషనల్ బుకర్‌ను గెలుచుకున్నారు.

బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయులు:

వి.ఎస్. నైపాల్ (1971-ఇన్ ఎ ఫ్రీ స్టేట్), సల్మాన్ రష్దీ (1981-మిడ్‌నైట్స్ చిల్డ్రన్), అరుంధతి రాయ్ (1997-ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్), కిరణ్ దేశాయ్ (2006-ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్), అరవింద్ అడిగా (2008-ది వైట్ టైగర్); ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్: గీతాంజలి శ్రీ (2022-టోంబ్ ఆఫ్ సాండ్) , బాను ముష్తాక్ (2025-హార్ట్ లాంప్)

హంగేరియన్‌-బ్రిటిష్‌ రచయిత డేవిడ్ స్జలేకు ‘బుకర్ ప్రైజ్' - Tholi Paluku