
స్వీయ అవగాహనతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట: డీజీపీ శివధర్ రెడ్డి
సమాజం సురక్షితంగా ఉండాలంటే ప్రతి పౌరుడు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, ఐపీఎస్ అన్నారు. కవాడిగూడలో నిర్వహించిన “జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్” సైబర్ అవగాహన కార్యక్రమాన్ని ఆయన, సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ బి.శివధర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రజల స్వీయ జాగ్రత్త చాలా ముఖ్యమని పేర్కొన్నారు. “ప్రతి ఇంట్లో ఒక ‘సైబర్ సింబా’ వలంటీర్ ఉంటే సమాజం మరింత భద్రతగా మారుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సైబర్ సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, రోజుకో కొత్త రకమైన మోసం సైబర్ ప్రపంచంలో జరుగుతోందని తెలిపారు. ప్రతి రోజు కోట్ల రూపాయలు సైబర్ నేరాల ద్వారా ప్రజల చేతిలో నుంచి పోతున్నాయని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింక్స్ లేదా యాప్‌లను నమ్మరాదని. ఏవైనా అనుమానాస్పద లింక్స్ లేదా స్కీమ్‌లను క్లిక్ చేయడం వల్ల మీ డబ్బు, డేటా ప్రమాదంలో పడవచ్చు అని ఆయన హెచ్చరించారు.
అదేవిధంగా, సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inవెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.
పోలీసు శాఖ తరపున సైబర్ సేఫ్టీపై పలు అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు నిర్వహించనున్నట్లు డీజీపీ తెలిపారు. ప్రజల సహకారం, అవగాహనే సురక్షిత తెలంగాణకు పునాది అని ఆయన సందేశమిచ్చారు.ప్రతి పల్లె, ప్రతి పట్టణం సైబర్ సురక్షితం కావాలి అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
సైబర్ నేరాల వల్ల ఎక్కువగా నష్టపోతున్న వర్గాలు?
తెలంగాణ సైబర్ క్రైమ్ యూనిట్‌లు, జాతీయ స్థాయిలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) గణాంకాల ప్రకారం..వృద్ధులు సాంకేతిక పరిజ్ఞానంలో తక్కువ అవగాహన కలిగి ఉండటం వల్ల ఈ వర్గం ఎక్కువగా మోసపోతుంది.అలాగే విద్యార్థులు లేదా యువత సోషల్ మీడియా ద్వారా ఫేక్ లింక్స్, గేమింగ్ యాప్‌లు, ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, ఫేక్ జాబ్ ఆఫర్లు వంటి మోసాలకు గురవుతున్నారు.ఉద్యోగులు ఫిషింగ్ ఈమెయిల్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు, మోసాలు ప్రధానంగా ఈ వర్గాన్ని లక్ష్యం చేస్తాయి. అలాగే రైతులు, గ్రామీణ వర్గాల వారు ప్రభుత్వ పథకాలు లేదా పీఎం-కిసాన్, బ్యాంక్ సబ్సిడీ, లోన్ సౌకర్యాలు పేరుతో వోటీపీ మోసాలు జరుగుతున్నాయి.
