Let's talk: editor@tmv.in
స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: బార్‌లో అగ్నిప్రమాదం, 40 మంది మృతి

స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: బార్‌లో అగ్నిప్రమాదం, 40 మంది మృతి

Shaik Mohammad Shaffee
3 జనవరి, 2026

కొత్త సంవత్సర వేళ స్విట్జర్లాండ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆల్ప్స్‌ పర్వత ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'క్రాన్స్‌-మోంటానా' రిసార్టులో ఉన్న 'లీ కాన్‌స్టలేషన్‌' బార్‌లో గురువారం తెల్లవారుజామున 1:30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 115 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి అసలు కారణం ఏంటి?

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బార్‌లో వేడుకలు జరుగుతుండగా ఒక వెయిటర్ తన భుజాలపై మరో వెయిట్రెస్‌ను ఎత్తుకుని తిరుగుతున్నాడు. ఆమె చేతిలో వెలుగుతున్న కొవ్వొత్తి ఉండటంతో, ఆ మంటలు బార్‌లోని చెక్క పైకప్పుకు అంటుకున్నాయి. బార్ లోపలి భాగం అంతా కలపతో నిర్మించి ఉండటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. పొగతో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడటంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. బేస్‌మెంట్ నుంచి బయటకు వచ్చే దారి ఇరుకుగా ఉండటం వల్ల తొక్కిసలాట జరిగి మరణాల సంఖ్య పెరిగింది.

బాధితుల్లో ఎక్కువ మంది యువతే

చనిపోయిన, గాయపడిన వారిలో ఎక్కువ మంది 16 నుండి 26 ఏళ్ల లోపు యువకులే కావడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇటలీకి చెందిన ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు ఎమాన్యుయెల్ గాలెప్పిని (16) ఈ ప్రమాదంలో మరణించినట్లు గుర్తించారు. బాధితుల్లో స్విస్ ప్రజలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్, పోలాండ్ దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే పదుల సంఖ్యలో అంబులెన్సులు, హెలికాప్టర్లు అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించాయి. మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో, ప్రస్తుతం అధికారులు డీఎన్ఏ, పళ్ళ నమూనాల ద్వారా వారిని గుర్తించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

ప్రాణభయం నుంచి బయటపడి..

పారిస్ నుంచి వచ్చిన 16 ఏళ్ల యాక్జెల్ క్లేవియర్ అనే యువకుడు ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. "లోపల అంతా గందరగోళంగా ఉంది. ఊపిరి ఆడకపోవడంతో కిటికీ అద్దాన్ని పగులగొట్టి బయటకు దూకాను. కానీ నా స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు" అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు తమ పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు ఆసుపత్రుల వద్ద కన్నీరుమున్నీరవుతున్నారు.

దర్యాప్తు ప్రారంభం

వాలైస్ కాంటన్ అటార్నీ జనరల్ బీట్రిస్ పిలోడ్ స్పందిస్తూ.. ఇది ఉగ్రదాడి కాదని, ప్రమాదవశాత్తు జరిగినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. అయితే, బార్‌ గరిష్ట సామర్థ్యం కంటే ఎక్కువ మందిని అనుమతించారా? నిబంధనలు ఉల్లంఘించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని పోలీసులు తెలిపారు.

దేశవ్యాప్తంగా సంతాపం

ఈ ఘోర ప్రమాదంపై స్విస్ అధ్యక్షుడు గై పర్మెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఐదు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించడానికి జ్యూరిచ్, లాసాన్ వంటి నగరాలలోని ప్రత్యేక కాలిన గాయాల వార్డులకు హెలికాప్టర్ల ద్వారా తరలించారు. ఈ విషాదంతో క్రాన్స్-మోంటానా అంతటా నిశ్శబ్దం అలుముకుంది. మృతుల జ్ఞాపకార్థం ప్రజలు ఆ బార్ ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్నారు.

స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: బార్‌లో అగ్నిప్రమాదం, 40 మంది మృతి - Tholi Paluku