Let's talk: editor@tmv.in
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ కార్యదర్శి సమీక్ష

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జీఏడీ కార్యదర్శి సమీక్ష

Gaddamidi Naveen
6 ఆగస్టు, 2026

రాజధాని పెరేడ్ గ్రౌండ్స్‌లో ఆగస్టు 15 స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ, ఉన్నాతాధికారులతో కలిసి ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

వేడుకలకు ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసుల అధికారులు హాజరుకానున్న నేపథ్యంలో వారి రాకపోకల మార్గాలు, వేదిక వద్ద కేటాయించే స్థానాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఆహ్వాన పత్రాల ముద్రణ, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పెరేడ్ గ్రౌండ్స్‌లో వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్కింగ్ సౌకర్యాలు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే శకటాల తయారీని త్వరితగతిన పూర్తి చేసి, ఈ నెల 13న నిర్వహించే తుది రిహార్సల్స్‌లో పూర్తి స్థాయిలో ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.