Let's talk: editor@tmv.in
స్వర కోకిల ఆశాభోంస్లే అంత్యక్రియలు పూర్తి
స్వర కోకిల ఆశాభోంస్లే అంత్యక్రియలు పూర్తి
స్వర కోకిల ఆశాభోంస్లే అంత్యక్రియలు పూర్తి

స్వర కోకిల ఆశాభోంస్లే అంత్యక్రియలు పూర్తి

Pinjari Chand
14 ఏప్రిల్, 2026

‘అభి నా జావో చోడ్‌కర్‌‌’ అనే మధుర గీతం స్వరాల మధ్య భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన గాన కోకిల ఆశాభోంస్లేకు సోమవారం ముంబైలో రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్క్‌లోని క్రిమిటోరియంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పించారు. ఆమె కుమారుడు ఆనంద్‌ చివరి కర్మలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు

భోంస్లే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వందలాది అభిమానులు అక్కడికి చేరుకుని చివరి నివాళులు అర్పించారు. ఆమె మనవరాలు జానై తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయని ఉషా మంగేష్కర్‌‌, సంగీత దర్శకుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌‌ కూడా అక్కడే ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్‌ షిండే, సునేత్రాపవార్‌‌, దర్శకుడు రమేశ్‌సిప్పీ, నటులు ఆమీర్‌‌ఖాన్‌, విక్కీ కౌశల్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గాయకులు షాన్‌, సుదేశ్‌భోంస్లే, అనూప్‌ జలోటా ఆమెకు సంగీత నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ‘జిందగీ ఏక్‌ సఫర్‌‌ హై సుహనా’ ప్యార్ కే మోడ్‌ పే’ వంటి పాటలు ఆలపించగా అక్కడి వాతావరణం మరింత భావోద్వేగంగా మారింది. అభిమానులు కూడా ఆమె ప్రసిద్ధ గీతాలను ఆలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు.

ఎనిమిది దశాబ్దాల సంగీత ప్రస్థానం

సుమారు 12,000కిపైగా పాటలు పాడిన అశాభోంస్లే ఎనిమిది దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. క్లాసికల్‌, గజల్‌, కబరే, పాప్‌ వంటి అనేక శైలుల్లో ఆమె గానం ప్రత్యేక గుర్తింపు పొందింది. ‘ఆయే మెహర్భాన్‌’, చురా లియా హై తుమ్నే, జుమ్కా గిరా రే’, దిల్‌ చీజ్‌ క్యా హై’ వంటి ఎన్నో హిట్‌ పాటలు తరతరాల సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి.

నగరం వీడ్కోలు

ముంబైలోని లోయర్‌ పరేల్‌లో ఉన్న ఆమె నివాసం నుంచి అంత్యయాత్ర బయలుదేరినప్పుడు ప్రజలు వీధులపై, భవనాల పైకప్పులపై నిలబడి ఆమెకు చివరి నివాళి అర్పించారు. ‘ఆశా తై అమర్‌‌ రహే’ అనే నినాదాలతో అభిమానులు స్వర దిగ్గజానికి నివాళులు అర్పించారు. ఆమె మృతదేహాన్ని త్రివర్ణ పతాకంతో కప్పి గాజు కాఫిన్‌లో ఉంచి ప్రజలకు దర్శనార్థం ఉంచారు.

ప్రముఖుల నివాళులు

నటులు ఆశా పరేఖ్‌, హెలెన్‌, రణబీర్‌‌ సింగ్‌, టబు, సంగీత దర్శకుడు ఏఆర్‌‌.రహమాన్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌‌, మహ్మద్‌ సిరాజ్‌ , రాజకీయ నాయకులు ఉద్దవ్‌ ఠాక్రే, ప్రపుల్‌పటేల్‌, సుప్రియా సులే తదితరులు ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు.

పురస్కారాలు

భారతదేశంలోని అత్యున్నత పురస్కారాలలో ఒకటైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, పద్మ విభూషణ్​, మహరాష్ట్ర భూషణ్ వంటి అనేక గౌరవాలను ఆమె అందుకున్నారు.