
స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు కార్యాలయాలతో మెరుగైన సేవలు: మంత్రి డోలా
రాష్ట్రంలో గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా పేరు మార్చే బిల్లుకు శాసన మండలిలో ఆమోదం లభించిన సందర్భంగా మంత్రి సభలో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు.
రాష్ట్రాన్ని “స్వర్ణాంధ్ర”గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ, వార్డు స్థాయిలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలుగా మార్చడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తున్నదని, వారికి ప్రమోషన్ల అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించే విధంగా తగిన విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.
అలాగే ఈ కార్యాలయాల పనితీరును పర్యవేక్షించేందుకు మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రజలకు అందుతున్న సేవలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయో లేదో నిరంతరం సమీక్షించవచ్చని అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో గ్రామస్థాయి పరిపాలనా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరింత బలోపేతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థను బలపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు సమర్థవంతంగా అందజేస్తున్నామని, అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు సరైన విధంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గ్రామాలు, వార్డుల స్థాయిలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలు ఒకేచోట అందుబాటులో ఉండేలా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
