Let's talk: editor@tmv.in
స్వర్ణగిరి: తెలంగాణ సిగలో మరో ఆధ్యాత్మిక మణిహారం

స్వర్ణగిరి: తెలంగాణ సిగలో మరో ఆధ్యాత్మిక మణిహారం

Dantu Vijaya Lakshmi Prasanna
17 జనవరి, 2026

తెలంగాణ పుణ్యభూమిపై ఆధ్యాత్మిక శోభ నానాటికీ విస్తరిస్తోంది. ఒకవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణంతో విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించగా, ఇప్పుడు అదే జిల్లాలో భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్‌పై వెలసిన "స్వర్ణగిరి" భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. తిరుమల శ్రీవారిని తలపించేలా, అత్యద్భుత శిల్పకళా సంపదతో నిర్మితమైన ఈ ఆలయం, భక్తుల పాలిట ‘కలియుగ వైకుంఠం’లా మారుతోంది.

స్వర్ణగిరి ఆలయ నిర్మాణం వెనుక ఒక గొప్ప సంకల్పం ఉంది. స్థానిక వ్యాపారవేత్త, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మానేపల్లి రామారావు కుటుంబం ఈ అద్భుత ప్రాజెక్టును చేపట్టింది. మానేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంది.

కేవలం ఒక దేవాలయాన్ని నిర్మించడమే కాకుండా, భక్తులకు ఆధ్యాత్మిక శాంతితో పాటు భారతీయ శిల్పకళా వైభవాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కొండకు "స్వర్ణగిరి" అని నామకరణం చేశారు. 2024 మార్చి 6న త్రిదండి శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి అమృత హస్తాలతో శాస్త్రోక్తంగా కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగాయి.

శిల్పకళా వైభవం: సంప్రదాయాల కలబోత

స్వర్ణగిరి దేవాలయం చూస్తుంటే ప్రాచీన భారతదేశపు మహా సామ్రాజ్యాలైన పల్లవ, చోళ, విజయనగర, చాళుక్య శిల్ప రీతులు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి. భారతీయ వాస్తుశాస్త్రం, ఆగమ శాస్త్ర నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు.

ఆలయ ప్రాకారానికి నాలుగు దిక్కుల నాలుగు భారీ రాజగోపురాలు ఉన్నాయి. ఇవి భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా గంభీరంగా కనిపిస్తాయి. గర్భాలయంపై ఉన్న 5 అంతస్థుల విమాన గోపురం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. దీనిపై చెక్కిన దేవతా మూర్తుల విగ్రహాలు కళాత్మకతకు నిదర్శనం. స్తంభాలపై దశావతారాలు, పురాణ గాథలను ప్రతిబింబించే శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రతి రాయి ఒక కథను చెబుతున్నట్లుగా ఉంటుంది.

ప్రధాన గర్భాలయం - 12 అడుగుల భారీ విగ్రహం

స్వర్ణగిరిలో ప్రధాన ఆకర్షణ, భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా, సుమారు 12 అడుగుల ఎత్తులో దివ్యమైన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. నిలువెత్తు విగ్రహాన్ని చూస్తున్నప్పుడు భక్తులు సాక్షాత్తు కలియుగ దైవాన్ని దర్శించుకుంటున్న అనుభూతికి లోనవుతారు. స్వామివారి ముఖవర్చస్సు, ఆభరణాల అలంకరణ కనువిందు చేస్తాయి.

ఉపాలయాలు, క్షేత్ర విశేషాలు

ప్రధాన ఆలయంతో పాటు, ఈ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు, ఆధ్యాత్మిక చిహ్నాలు ఉన్నాయి. అలమేలు మంగ, గోదాదేవిల అమ్మవార్ల సన్నిధులు భక్తిభావంతో నిండి ఉంటాయి. వేణువు ఊదుతున్నట్టున్న మదన గోపాల కృష్ణ స్వామి విగ్రహం భక్తులను కట్టిపడేస్తుంది.

ఇక్కడ ప్రత్యేకంగా గరుడాల్వార్, విశిష్టాద్వైత సిద్ధాంతకర్త శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఆలయ ప్రవేశంలోనే 27 అడుగుల ఎత్తైన ఏకశిలా హనుమంతుడి విగ్రహం అభయమిస్తున్నట్లు కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి & భూ వరాహ స్వామి వారికి కూడా ప్రత్యేక ఉపాలయాలు ఇక్కడ ఉన్నాయి. వకుళమాత ఆలయం నిర్మించి స్వామి వారి తల్లి వకుళమాతకు కూడా ఇక్కడ ప్రాముఖ్యత కల్పించారు.

జలనారాయణ మూర్తి, పుష్కరిణి

ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి ఆధ్యాత్మికంగానూ, పర్యాటక పరంగానూ ప్రత్యేకమైనది. పుష్కరిణి మధ్యలో జలనారాయణ మూర్తి విగ్రహం ప్రతిష్టించబడింది. నీటి మధ్యలో శయనించిన స్వామివారిని చూడటం భక్తులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. సాయంత్రం వేళల్లో విద్యుత్ దీపాల అలంకరణలో ఈ ప్రాంతం స్వర్గంలా కనిపిస్తుంది.

ప్రత్యేక ఆకర్షణలు:

గోశాల:

ఆలయ ప్రాంగణంలోనే గోశాల ఉంది. భక్తులు గోవులను దర్శించుకోవచ్చు.

లైటింగ్:

వీలైతే సాయంత్రం వేళ ఆలయాన్ని సందర్శించండి. విద్యుత్ దీపాల వెలుగులో స్వర్ణగిరి నిజంగానే 'బంగారు కొండ'లా మెరిసిపోతుంది.

ఫోటో పాయింట్:

27 అడుగుల హనుమంతుని విగ్రహం, జలనారాయణ మూర్తి విగ్రహం వద్ద ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

ఆధ్యాత్మిక వాతావరణం, సదుపాయాలు

స్వర్ణగిరి కేవలం ప్రార్థనా స్థలమే కాదు, ఇది ఒక పరిపూర్ణ ఆధ్యాత్మిక క్షేత్రం.

ఇక్క నెలకొన్న వేద మూర్తుల విగ్రహాలు మన సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెబుతాయి. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం 40 అడుగుల ఎత్తైన రథాన్ని సిద్ధం చేశారు. భక్తులు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి, భజనలు నిర్వహించుకోవడానికి విశాలమైన మండపాలు ఉన్నాయి. భక్తుల కోసం ట్రస్ట్ ద్వారా భోజన వసతులు కల్పించబడతాయి.

పర్యాటక, రవాణా సౌకర్యాలు

హైదరాబాద్‌కు సమీపంలో (సుమారు 45-50 కి.మీ) ఉండటం వల్ల వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.

భక్తుల సౌకర్యార్థం ఉప్పల్, జేబీఎస్ నుండి నేరుగా స్వర్ణగిరి ఆలయానికి టీజీఎస్‍ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి.

సొంత వాహనాల్లో అయితే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి (NH 163) మీద ప్రయాణించి భువనగిరి దాటిన తర్వాత సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు.

ఆధునిక కాలంలో నిర్మించినప్పటికీ, వేల ఏళ్ల నాటి సంస్కృతిని, సంప్రదాయాన్ని స్వర్ణగిరి ప్రతిబింబిస్తోంది. మనసుకి ప్రశాంతత, కంటికి శిల్పకళా సౌందర్యం, ఆత్మకు దైవ చింతన అందించే క్షేత్రంగా స్వర్ణగిరి వెలుగొందుతోంది. తిరుమలకు వెళ్లలేని భక్తులు, ఇక్కడ కొలువై ఉన్న 12 అడుగుల శ్రీనివాసుడిని దర్శించుకుని ధన్యులవుతున్నారు.

దర్శన సమయాలు

స్వర్ణగిరి ఆలయం భక్తుల సౌకర్యార్థం ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. అయితే మధ్యాహ్నం వేళలో స్వామివారికి విశ్రాంతి (నివేదన) సమయం ఉంటుంది. ఉదయం: 06:00 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 01:30 నుండి 03:30 వరకు మధ్యాహ్నం విరామం (ఈ సమయంలో దర్శనాలు ఉండవు). సాయంత్రం 03:30 నుండి 08:30 వరకు మళ్లీ దర్శనంకు అనుమతిస్తారు.

గమనిక:

శనివారాలు, ఆదివారాలు పండుగ రోజులలో భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉండవచ్చు. రద్దీ ఎక్కువగా ఉంటే రాత్రి 9:00 గంటల వరకు కూడా దర్శనం కొనసాగిస్తారు.

ప్రధాన సేవలు, ప్రసాదాలు

ఆలయంలో తిరుమల తరహాలోనే ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ప్రతి వారం శుక్రవారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం మధ్యాహ్నం వేళ నిత్య అన్నదాన సౌకర్యం ఉంటుంది. మానేపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ దీనిని నిర్వహిస్తోంది. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా రుచికరమైన లడ్డూ ప్రసాదం భక్తులకు కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. కొత్త వాహనాలకు పూజలు చేయించుకోవడానికి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.

ముఖ్యమైన సూచనలు

ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేకపోయినా, హైందవ సంప్రదాయం ప్రకారం పద్ధతైన దుస్తుల్లో (పురుషులు ధోతి/కుర్తా, స్త్రీలు చీర/చుడీదార్) వెళ్లడం గౌరవప్రదంగా ఉంటుంది. ఆలయ గర్భాలయం లోపల ఫోటోలు లేదా వీడియోలు తీయడం నిషిద్ధం. ఆలయ ప్రాంగణంలో, గోపురాల వద్ద ఫోటోలు తీసుకోవచ్చు. ఆలయ మెట్లు ఎక్కే ముందే కింద పాదరక్షలు విడిచిపెట్టడానికి స్టాండ్ సౌకర్యం ఉంది. ఆలయం కొండపై ఉన్నప్పటికీ, వృద్ధులు, వికలాంగుల కోసం ర్యాంప్ సౌకర్యం, సులభంగా ఎక్కడానికి వీలుగా మెట్లు నిర్మించారు. హైదరాబాద్ నుండి వెళ్తున్నట్లయితే, ఉప్పల్ - ఘటకేసర్ - బీబీనగర్ - భువనగిరి రూట్ ద్వారా వెళ్లవచ్చు. సొంత కార్లలో వెళ్లే వారికి ఆలయ కొండ కింద, పైన విశాలమైన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంది.