
స్వదేశీ వస్తువుల వినియోగం దేశభక్తికి నిదర్శనం - ఒట్టి మాటలేనా? గట్టి చేతలున్నాయా?
ఆత్మనిర్భరభారత్ గురించి, మేకిన్ ఇండియా గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దేశానికి శత్రువులెవరూ లేరని, విదేశాల్లో తయారయిన వస్తువులను వాడడమే శత్రుత్వం అని, భారత్‌లో తయారయిన వస్తువులే వాడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని ప్రధాని ఇటీవల చెప్పారు. స్వాతంత్ర్యోద్యమంలో స్వదేశీ నినాదం ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో గుర్తుచేసుకుని, ఆ స్ఫూర్తితో స్వదేశీ వస్తువుల వాడకంపై దృష్టిపెట్టాలని మోదీ అంటున్నారు. అయితే మోదీ డ్రెస్‌లు, వాడే వస్తువులన్నీ విదేశీ బ్రాండ్‌లకు చెందినవని, తాను ఆచరించకుండా దేశంలోని మిగిలిన ప్రజలు స్వదేశీ వస్తువులే వాడాలని కోరడం ఎంతవరకు సమంజమని కొందరు విమర్శిస్తున్నారు. మోదీ సంగతి పక్కనపెడితే, మన రాజకీయనాయకులు, సినిమా స్టార్లు, ఇతర ప్రభావవంతమైన రంగాల్లో ఉండే సెలబ్రిటీలందరూ విదేశీ వస్తువులు వాడడాన్ని, వీలయినంత ఆడంబరంగా కనిపించడాన్ని ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాల్లో తయారయ్యే దుస్తులు, ఆహారం, వస్తువులు, గృహోపకరణాలు, ఫోన్‌లు, ఇతర గాడ్జెట్లు, మద్యం ఇలా చెప్పుకుంటూ పోతే మన నేతలు, ఇతర సెలబ్రిటీలకు ఫారిన్ బ్రాండ్ లేకుండా రోజు గడవదు. తాము విలాసవంతంగా, ఆడంబరంగా జీవిస్తూ ప్రజలు మాత్రం స్వదేశీ వస్తువులే కొంటూ నిరాడంబరంగా జీవించాలని, ఆదర్శప్రాయంగా ఉండాలని కోరడంలో హేతుబద్ధత ఉందా?
మోదీనే చెప్పినట్టు స్వాతంత్ర్యపోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వదేశీ ఉద్యమాన్ని తీసుకుంటే అప్పుడు నేతలు తాము ఆచరించి చూపి తర్వాత ప్రజలకు ఎలా ఉండాలో నేర్పించేవారు. విదేశీవస్త్రాలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నతర్వాత తొలిగా దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్ననేతలే ముందుగా విదేశీ వస్త్రధారణను వదిలిపెట్టి ఖద్దరు ధరించడం ప్రారంభించారు. మహాత్మాగాంధీ స్వయంగా నూలువడికి, దేశప్రజలందరూ తమకు కావాల్సిన వస్త్రాలు తామెలా తయారుచేసుకోవాలో మార్గదర్శనం చేశారు. ప్రజలు దాన్ని అనుసరించారు. ఖద్దరు వస్త్రాలు ధరించడం అప్పుడు దేశభక్తికి చిహ్నం. అలా ఓ వెల్లువలా స్వదేశీ ఉద్యమం ప్రజలకు స్ఫూర్తినిచ్చి, దేశమంతా వ్యాపించి స్వాతంత్ర్యపోరాటంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడాపరిస్థితి లేదు. అందుకే మోదీ పిలుపునిచ్చిన స్వదేశీ నినాదాన్ని ఎంతమంది ఆచరిస్తారో తెలియదు. నిజానికి దేశప్రజలంతా భారత్‌లో తయారయిన వస్తువులే వాడాలనుకుంటే అది దేశచరిత్రను, ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పుతుంది. దేశపురోభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పటికిప్పుడు వందశాతం ఆచరణసాధ్యం కాకపోయినా నెమ్మదినెమ్మదిగా విదేశీ వస్తువులకు దూరం జరిగితే, స్వదేశంలో తయారయిన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.
అది ఉపాధిని పెంచుతుంది. ఉపాధి ద్వారా వచ్చిన డబ్బు తిరిగి మార్కెట్‌లోకి తరలుతుంది. మొత్తంగా తయారీరంగం, ఉపాధి ఆర్థికవ్యవస్థను అంచనాలకందని రీతిలో మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా అనేక అంతర్జాతీయ కంపెనీలకు మన మార్కెట్ కీలకంగా మారింది. ఫోన్లు, టీవీలు, కార్లు, బ్రాండెడ్ వస్త్రాలు, ఈ కామర్స్ మార్కెట్లు, ఫ్యాషన్ ట్రెండ్లు ఇలా ఎన్నో విషయాల్లో అనేక బహుళజాతికంపెనీలు భారత్ నుంచి సమకూరే ఆదాయం ద్వారానే మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో వ్యాపారం చేసుకోగలుగుతున్నాయి. అదే ఆ కంపెనీలు భారత్‌కు చెందినవి అయి ఉండి, ఇక్కడే తయారు చేసి, ఇక్కడే అమ్మకాలు జరిగితే ఎన్నో రకాలుగా లాభం చేకూరుతుంది. దిగుమతి సుంకాలుండవు. రవాణా ఛార్జీలు తగ్గుతాయి. దీంతో దేశప్రజలకు కావాల్సిన వస్తువులు కారుచౌకగా దొరుకుతాయి. కానీ ప్రభుత్వాలు ఈ దిశగా దృష్టిపెట్టడం లేదు. కొత్త పరిశ్రమలు స్థాపించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భారత్ చాలా దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది.
భూసేకరణ, నియయ నిబంధనలు, అనుమతులు వంటివాటివిషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే భారత్‌కు చెందిన కొన్ని కంపెనీలు సైతం విదేశాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటుచేసి, వస్తువులు ఉత్పత్తిచేసి అక్కడినుంచి దిగుమతులు చేసి, సుంకాలు చెల్లించి ఇక్కడ భారీ ధరలకు అమ్ముకుని లాభాలు పొందుతున్నాయి. అదే భారత్‌లోనే అన్ని రకాల సౌకర్యాలు ఉంటే ఆ వస్తువు వినియోగదారునికి కారుచౌకగా అందుతుంది. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. దీంతో పాటు అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు స్వదేశీ వస్తువుల వాడకంపై తాము అవగాహన పెంచుకుని, ప్రజలను ఆ దిశగా నడిపించాలి. తాము ఫారిన్ ఇంపోర్టెడ్ కార్లలో తిరుగుతూ, ప్రజలను మాత్రం స్వదేశీ స్కూటర్లతో సర్దుకోమనడం నాయకత్వలక్షణం అనిపించుకోదు. విదేశీ వస్తువులపై ముందుగా నేతలు, ఇతర సెలబ్రిటీలు మోజు తగ్గించుకుని, స్వదేశంలో తయారయిన వస్త్రాలను ధరించడం, వస్తువులు వాడడం ఫ్యాషన్‌గా భావిస్తే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది.
జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మన జేబులో వాడుతున్న దువ్వెన ఎక్కడ తయారయిందో మనకు తెలియదని, అది తెలుసుకోవాలని, కొనుగోలుదారులు, అమ్మకం దారులందరూ స్వదేశీ వస్తువులపై దృష్టిపెట్టాలని, దుకాణాలన్నీ స్వదేశీ వస్తువులతో నిండిపోవాలని పిలుపునిచ్చారు. నిజంగానే కార్పొరేట్ సంస్థలు మొదలుకుని, చిన్నస్థాయి వ్యాపారులు దాకా అందరూ అంకితభావంతో, పట్టుదలతో దీనిపై పనిచేయడం ఆరంభిస్తే మన ఇంట్లో, మన వీధిలో దుకాణంలోని వస్తువులన్నీ మేక్ ఇన్ ఇండియావి అయ్యుండడానికి పెద్దగా సమయం పట్టదు. ఒక్కసారి ఈ స్వావలంబన సాధిస్తే, ఆ తర్వాత కూడా అదే బాటలో నడిస్తే ప్రపంచ వస్తువుల ఎగుమతి మార్కెట్‌గా మారడానికి భారత్‌కు అవకాశం ఉంటుంది. అప్పుడు దేశప్రజలతో పాటు వ్యాపార సంస్థలూ లాభపడతాయి. ఆర్థికరంగంలో ఇప్పటికే భారత్ చాలా ప్రపంచదేశాలతో పోలిస్తే బలంగా ఉంది. మన పొరుగుదేశాలు శ్రీలంక, పాకిస్తాన్ వంటివాటితో పోలిస్తే ఆర్థికాభివృద్ధి స్థిరంగా ముందుకు సాగుతోంది. కరోనా కష్టకాలాన్ని అధిగమించి దేశఆర్థికవ్యవస్థ ప్రపంచంలో ఐదోస్థానంలో నిలవడం మామూలు విషయమేమీ కాదు. స్వాంతంత్ర్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు స్వదేశీ నినాదంపై పూర్తిస్థాయిలో దృష్టిపెడితే అనతికాలంలోనే అమెరికా, చైనాలతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి భారత్ చేరే అవకాశముంది.
