
స్వతంత్రంగా ఆలోచించి ఓటేయాలి: 1954లో నెహ్రు
1954లో లోక్‌సభ స్పీకర్‌ను తొలగించాలంటూ ప్రతిపక్షం తీసుకువచ్చిన తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో, అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ ఎంపీలకు ఇచ్చిన సందేశ ఏంటంటే ‘మీరు ఎలాంటి విప్ లేదా ఆదేశాలకు బద్ధులు కారు అని స్పష్టం చేశారు. పార్టీ అనుబంధాలను పక్కనబెట్టి, సభ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సభ్యుడు స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు ప్రతిపక్షం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైన సందర్భాలు మళ్లీ చర్చకు వచ్చాయి.
1954: జి.వి. మావళంకర్‌పై తీర్మానం
1954 డిసెంబర్ 18న ప్రతిపక్షం అప్పటి స్పీకర్ జి.వి. మావళంకర్ ను తొలగించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టింది. 50 మందికిపైగా సభ్యులు లేచి మద్దతు తెలపడంతో తీర్మానం ఆమోదయోగ్యంగా తీసుకుని చర్చకు వచ్చింది. చర్చ సందర్భంగా ప్రతిపక్షం, సంఖ్యాబలం తక్కువైనా, ప్రభుత్వం, స్పీకర్‌పై తీవ్ర విమర్శలు చేసింది. స్పీకర్ పక్షపాతిగా వ్యవహరించారని ఆరోపించింది.
ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న నెహ్రూ ‘నేను ఈ సభ నాయకుడిగా మాట్లాడుతున్నాను. మెజారిటీ పార్టీ నాయకుడిగా కాదు. మా పార్టీ సభ్యుల్లో ఎవరూ విప్‌కు బద్ధులు కారు. ఇది పార్టీ విషయం కాదు. ఇది ఈ సభ గౌరవానికి సంబంధించిన విషయం’ అని అన్నారు. స్పీకర్‌పై బోనా ఫైడ్స్ (నిజాయితీ)ను ప్రశ్నించడం పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. స్పీకర్ తీర్పు నచ్చకపోవచ్చు. అసహనం కలిగించవచ్చు. కానీ, ఆయన నిజాయితీని సవాలు చేయడం పూర్తిగా వేరు. అలా చేస్తే ప్రపంచానికి, మన దేశానికి మనం చిన్న మనుషులమనే సందేశం ఇస్తామని నెహ్రూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగం స్పీకర్‌పై తీర్మానం పెట్టే హక్కు ఇస్తుందని అంగీకరించినప్పటికీ, చట్టబద్ధ హక్కు ఉన్నా, దాని సముచిత, అవసరం గురించి ఆలోచించాలన్నారు.
బ్రిటిష్ పార్లమెంట్ చరిత్ర ఉదాహరణలను ప్రతిపక్షం ప్రస్తావించగా మనం 20వ శతాబ్దంలోని భారత గణతంత్రంలో ఉన్నాం. మన పార్లమెంట్ గౌరవమే ముఖ్యమని నెహ్రూ స్పష్టం చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌కు 360కి పైగా సభ్యులతో స్పష్టమైన మెజారిటీ ఉండగా, తీర్మానం మూజువాణి ఓటుతో తిరస్కరించింది.
తరువాతి సందర్భాలు
1966: స్పీకర్ సర్దార్ హుకం సింగ్ పై ప్రతిపాదిత తీర్మానం ప్రారంభానికి అవసరమైన 50 మంది మద్దతు కూడగట్టలేక పోవడంతో ముందుకు సాగలేదు.
1987 ఏప్రిల్ 15: స్పీకర్ బల్రామ్ జాఖర్ ను తొలగించాలంటూ ప్రతిపక్షం తీర్మానం తెచ్చింది. చర్చలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, 1954 చర్చలో నెహ్రూ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ ప్రతిపక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తీర్మానం కూడా మూజువాణి ఓటుతో వీగిపోయింది.
2024 డిసెంబర్: రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ను తొలగించాలంటూ ప్రతిపక్షం నోటీసు ఇచ్చినా, విధానపరమైన కారణాలతో అది ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ఇటీవల ఓం బిర్లాను తొలగించేందుకు ప్రతిపక్షం ఇచ్చిన నోటీసు బడ్జెట్ సమావేశాల రెండో విడత (మార్చి 9 నుంచి) ప్రారంభమైన తర్వాత జాబితా చేయనుంది. నిబంధనల ప్రకారం వేగవంతమైన సమీక్ష ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
