
స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు భారీ జరిమానా
దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (నిర్ణీత సమయం కంటే నెమ్మదిగా బౌలింగ్ చేయడం) కారణంగా భారత క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ జరిమానా విధించింది. సోమవారం ఈ విషయాన్ని ఐసీసీ ప్రకటించింది. టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్దేశించిన సమయం కంటే రెండు ఓవర్లు తక్కువ వేసినట్లు తేలింది. మ్యాచ్ సమయం లెక్కించిన తర్వాత కూడా, కేఎల్ రాహుల్ నాయకత్వంలోని టీమిండియా రెండు ఓవర్లు నెమ్మదిగా వేసినట్లు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ అధికారి రిచీ రిచర్డ్‌సన్ తెలిపారు. ఐసీసీ నియమాల ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. భారత జట్టు రెండు ఓవర్లు ఆలస్యం చేయడంతో, మొత్తం 10 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది.
నిబంధనను ఒప్పుకున్న కెప్టెన్ రాహుల్
ఈ ఆలస్యానికి కారణం తానేనని జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అంగీకరించారు. ఆయన నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు, విధించిన జరిమానాను కూడా ఆమోదించారు. దీనివల్ల ఈ విషయంపై వేరే విచారణ అవసరం లేకుండా పోయింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రాడ్ టకర్, రోహన్ పండిట్, థర్డ్ అంపైర్ శ్యామ్ నోగాజ్స్కీ, ఫోర్త్ అంపైర్ జయరామన్ మదనగోపాల్ ఈ స్లో ఓవర్ రేట్ చార్జీని నమోదు చేశారు.
ఈ జరిమానా విధించిన రెండవ వన్డేలో భారత్ ఓడిపోవడంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సౌత్ ఆఫ్రికా 1-1తో సమం చేసింది. అయితే, చివరిదైన మూడవ వన్డే విశాఖపట్నంలో జరిగింది. అందులో భారత్ విజయం సాధించి, సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు.
