
స్లీపర్ బస్సులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు
భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన స్లీపర్ కోచ్ బస్సులన్నింటినీ తక్షణమే రోడ్ల మీద నుంచి తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యులు ప్రియాంక్ కనూంగో శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రహదారిపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమైన దారుణ ఘటనల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వయంగా స్పందించింది. చాలా స్లీపర్ బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్‌ను ప్రయాణికుల భాగం నుంచి పూర్తిగా వేరుచేసి సీలు వేయడం వల్ల మంటలు ఎప్పుడు వచ్చాయో కూడా డ్రైవర్‌కే తెలియకపోవడం, అత్యవసర తలుపులు తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు బయటపడలేక ఇటుంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది.రాజస్థాన్‌లో అక్టోబర్ 18న జరిగిన ఓ స్లీపర్ బస్సు దహనం ఘటన తర్వాత సీఐఆర్‌టీ (పూణే) చేసిన పరిశోధనలో ఈ లోపాలు రుజువయ్యాయి. ఈ బస్సు ఏఐఎస్-119 నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్టు నివేదిక ఇచ్చింది.
2019 నుంచే అమలులో ఉన్న నిబంధనలు
• డ్రైవర్ క్యాబిన్‌కు, ప్రయాణికుల భాగానికి మధ్య పూర్తి తలుపులు అనుమతించరు
• 12 మీటర్ల బస్సుకు కనీసం 4, 12 మీటర్లకంటే ఎక్కువైతే 5 అత్యవసర మార్గాలు తప్పనిసరి
• ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ (ఎఫ్డీఎస్ఎస్) నుంచి తప్పనిసరి
• మంటలు అంటుకోని మెటీరియల్స్, సరైన వైరింగ్ ఇన్సులేషన్ తప్పనిసరి
అయినా దేశవ్యాప్తంగా వేలాది ప్రైవేటు స్లీపర్ బస్సులు ఈ నిబంధనలు పాటించకుండానే రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు రెండు వారాల్లో రవాణా మంత్రిత్వ శాఖ, సీఐఆర్‌టీ నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రాలు ఇప్పటి నుంచే నిబంధనలు ఉల్లంఘించిన స్లీపర్ బస్సులను స్వాధీనం చేసుకోనున్నాయి. దీంతో ఢిల్లీ-మనాలీ, ముంబై-గోవా, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు వంటి మార్గాల్లో ప్రైవేటు స్లీపర్ బస్సుల సర్వీసులు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉన్న బస్సులు మాత్రమే రోడ్లపై నడుస్తాయని, టికెట్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రవాణా నిపుణులు అంచనా వేస్తున్నారు. రోడ్డు భద్రతపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇచ్చిన ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సు రంగాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది.
