Let's talk: editor@tmv.in
‘స్మార్ట్ సిటీస్ మిషన్’ అసంపూర్ణమైన పథకం: రాహుల్‌గాంధీ

‘స్మార్ట్ సిటీస్ మిషన్’ అసంపూర్ణమైన పథకం: రాహుల్‌గాంధీ

Pinjari Chand
1 ఏప్రిల్, 2026

కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ ’పై కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరాల మొత్తం అభివృద్ధి లక్ష్యంగా కాకుండా, ప్రజలకు ‘మొత్తం మార్పు కథ’గా చూపించి దేశానికి అసంపూర్ణమైన పథకాన్ని అంటగట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం తన వాట్సాప్ చానల్‌లో స్పందించిన రాహుల్ గాంధీ, ఈ పథకం మోడీ ప్రభుత్వ పనితీరుకు ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. భారీ ప్రకటనలు, మరింత భారీ ప్రచారం, కానీ బాధ్యత మాత్రం లేదని ఆయన విమర్శించారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, భద్రత వంటి ప్రాథమిక అవసరాలు లేకపోతే ఏ నగరం ‘స్మార్ట్ సిటీ’గా పరిగణించలేం. అయినప్పటికీ ఈ పథకాన్ని ప్రధాని తరచుగా గొప్పగా ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. పథకం ముగింపు దశకు చేరుకున్న సమయంలో దాని ఫలితాలపై పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినట్లు గాంధీ తెలిపారు. అయితే అందిన సమాధానాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పారు.

‘పూర్తి నగరాభివృద్ధి లక్ష్యమే కాదు’

స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యం మొత్తం నగర అభివృద్ధి కాదని ప్రభుత్వ సమాధానాల ద్వారా స్పష్టమైందని గాంధీ ఆరోపించారు. దేశానికి పూర్తి మార్పు కథగా చూపించిన ఈ పథకం నిజానికి అసంపూర్ణమైందని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ అంటే ఏమిటి? విజయాన్ని ఏ ప్రమాణాల ఆధారంగా కొలుస్తారు? ఎన్ని నగరాలు నిజంగా మారాయి? ప్రజల జీవితాల్లో ఏ మార్పు వచ్చింది? వంటి ప్రశ్నలు అడిగినా స్పష్టమైన సమాధానాలు లభించలేదని తెలిపారు. సుమారు రూ.48 వేల కోట్లు ఖర్చు చేశామని, 97 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని విమర్శించారు. అన్నీ పూర్తయ్యాయని చెబితే మీ నగరంలో నిజంగా ఏమి మారింది? అని ప్రశ్నించారు.

భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితి

క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని గాంధీ అన్నారు. కలుషితమైన నీరు, తెరచి ఉన్న కాల్వల వల్ల మరణాలు జరుగుతున్నాయని, వంతెనలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం వంటి సమస్యలు ఈ పథకం వైఫల్యాన్ని చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పథకం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాన్ని చూపిస్తుంది. భారీ ప్రకటనలు, భారీ ప్రచారం తప్పా ఏమాత్రం బాధ్యత లేదని ఆయన అన్నారు. ప్రజలు తమ నగరాన్ని జాబితాలో చూసి నిజంగా అది స్మార్ట్ సిటీ అయ్యిందా అనే విషయాన్ని తామే నిర్ణయించుకోవాలని సూచించారు.

పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలు

పార్లమెంట్‌లో గాంధీ పలు ప్రశ్నలు అడిగారు. స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభం నుంచి మొత్తం ఎంత నిధులు మంజూరు అయ్యాయి? ఎంత విడుదలయ్యాయి? ఎంత ఖర్చు పెట్టారు? అనే వివరాలను అడిగారు. అలాగే నగరాన్ని స్మార్ట్ సిటీగా గుర్తించేందుకు ఏ ప్రమాణాలు ఉపయోగించారు? ఎన్ని నగరాలు ఆ ప్రమాణాలు సాధించాయి? అనే విషయాలు కూడా ప్రశ్నించారు. అదనంగా, నగరాల పనితీరుపై ప్రభుత్వానికి ఏదైనా పోలికల అంచనా ఉందా? ఉంటే అత్యుత్తమంగా పనిచేసిన పది నగరాల జాబితా ఏమిటి? అలాగే ఈ పథకం నగర మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఎంతవరకు దోహదపడిందో స్వతంత్రంగా ఎవరైనా అధ్యయనం చేశారా? అనే ప్రశ్నలు కూడా ఆయన లేవనెత్తారు.

ఏరియా ఆధారిత అభివృద్ధి మాత్రమే... ప్రభుత్వ సమాధానం

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి తోకాన్‌ సాహు సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.48,000 కోట్లలో 100 నగరాలు రూ.47,458 కోట్లు (సుమారు 99 శాతం) పొందినట్లు తెలిపారు. 2026 మార్చి 1 నాటికి అందులో రూ.46,326 కోట్లు (98 శాతం) వినియోగించారని చెప్పారు. మొత్తం 8,064 ప్రాజెక్టులు రూ.1,64,811 కోట్ల వ్యయంతో చేపట్టగా, అందులో 7,784 ప్రాజెక్టులు (97 శాతం) పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 280 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీస్ మిషన్ లక్ష్యం మొత్తం నగరాన్ని అభివృద్ధి చేయడం కాదని, ఏరియా ఆధారిత అభివృద్ధి విధానాన్ని అనుసరించడం అని మంత్రి వివరించారు. రెట్రోఫిట్టింగ్, రీడెవలప్‌మెంట్, గ్రీన్‌ఫీల్డ్ అభివృద్ధి వంటి విధానాల ద్వారా నమూనా ప్రాంతాలను అభివృద్ధి చేసి ఇతర ప్రాంతాల్లో కూడా వాటిని అమలు చేయడమే లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా నీతి ఆయోగ్‌ 2025 సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ పథకం భారత పట్టణాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఉందని, జాతీయ అభివృద్ధి లక్ష్యాలు, ఎస్‌డీజీస్‌తో సరిపోతుందని మంత్రి తెలిపారు. అలాగే నగరాల వారీగా కేంద్ర సహాయం వినియోగం, ప్రాజెక్టుల పురోగతి వంటి వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది.

‘స్మార్ట్ సిటీస్ మిషన్’ అసంపూర్ణమైన పథకం: రాహుల్‌గాంధీ - Tholi Paluku