Let's talk: editor@tmv.in
స్మార్ట్ సిటీగా నూజివీడు..రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం: మంత్రి కొలుసు పార్థసారథి

స్మార్ట్ సిటీగా నూజివీడు..రూ.6 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం: మంత్రి కొలుసు పార్థసారథి

Panthagani Anusha
13 ఫిబ్రవరి, 2026

నూజివీడు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రూ.6 కోట్ల నిధులతో పలు మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని మండలాల్లో బీటీ, సీసీ రహదారుల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టిన మంత్రి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నూజివీడులో రహదారుల విస్తరణతో పాటు డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం పార్కుల అభివృద్ధి, స్మశానవాటిక సదుపాయాల మెరుగుదల సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు.

ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు రూ.61 లక్షల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణం జరుగుతోంది. చిన గాంధీ సెంటర్ నుంచి హనుమాన్ జంక్షన్ రోడ్డులోని ఎన్‌టీఆర్ విగ్రహం వరకు రహదారి విస్తరణకు రూ.1.32 కోట్లు కేటాయించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.63 లక్షలు మంజూరు చేశారు. సీసీ రహదారుల అభివృద్ధికి రూ.1 కోటి, సీసీ రహదారులు–డ్రైనేజీ పనులకు రూ.1.64 కోట్లు వినియోగించనున్నారు. పట్టణ పార్కు అభివృద్ధికి రూ.40 లక్షలు, స్మశానవాటిక అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.

మంత్రి మాట్లాడుతూ నూజివీడును రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పట్టణంలో రహదారుల మరమ్మత్తులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో వీధి దీపాల ఆధునీకరణ, కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు, చెత్త నిర్వహణ వ్యవస్థను మెరుగుపరచడం వంటి పనులు దశలవారీగా చేపడతామని తెలిపారు. స్మార్ట్ సిటీ లక్ష్యంతో డిజిటల్ సేవలు, సీసీ కెమెరాల ఏర్పాటు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

మున్సిపల్ అధికారులు ప్రజలతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు సమయానికి పూర్తిచేసి నూజివీడును ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.