Let's talk: editor@tmv.in
స్మగ్లర్లు బాబోయ్.. స్మగ్లర్లు

స్మగ్లర్లు బాబోయ్.. స్మగ్లర్లు

FL - TRND
18 అక్టోబర్, 2025

ఇండియాలో బంగారం స్మగ్లింగ్‌ పెరిగిపోతోంది. దీపావళికి ముందు పసడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న వేళ.. మార్కెట్‌లో బంగారం కొనుగోలు ఓ ఊహించని ఒత్తిడికి గురైంది. రూపాయి విలువ తగ్గినప్పుడు, అంతర్జాతీయ ధరలు పెరిగినప్పుడు, సరఫరా తక్కువైనప్పుడు ఆకర్షణ బలపడింది. అధికారిక దిగుమతులపై పన్నులు ఉండటంతో కొందరు చట్టాన్ని మింగి కన్నేశారు. చిన్న ముఠాలు, మధ్యవర్తులు, అంతర్జాతీయ నెట్వర్క్‌లు ఈ పని చేస్తుంటాయి. విమానాశ్రయాల నుంచి బ్యాగుల్లో దాచడం, శరీరంపై తీసుకువెళ్ళటం, ప్యాకేజింగ్ మార్చడం లాంటి పద్ధతులు వాడుతున్నారు. ఈసారి పండుగ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో లాభం భారీగా ఉంది.

సాధారణంగా బంగారం దిగుమతి చేయాలంటే 6శాతం ట్యాక్స్, మరో 3శాతం సేల్స్ ట్యాక్స్ ఉంటుంది. కానీ స్మగ్లర్స్‌ ఈ పన్నులు తప్పించుకుంటారు. అందుకే వాళ్లకి లాభం పెద్దది. ఒక్క కిలో బంగారంపై 11లక్షల రూపాయల లాభం వస్తుంది. ఎవరికైనా ఇంత లాభం అంటే ఆకర్షణే. దీపావళి, ధన్తేరస్ సమయం బంగారం కొనుగోలు చేసే కాలం. ప్రతి ఇంట్లో బంగారం కొనుక్కోవాలని ఆచారం. అదే సమయంలో సరఫరా తగ్గింది. బ్యాంకులు, దిగుమతిదారులు బంగారం తేవడంలో వెనుకబడ్డారు. అందుకే స్మగ్లర్స్‌కి ఇది మంచి అవకాశం అయ్యింది. వాళ్లు రాత్రింబగళ్లు పని మొదలుపెట్టారు.

ఈ బంగారం ఎలా తెస్తారంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. కొందరు విమానాల్లో బంగారం దాచుకుని వస్తారు. కొందరు దుస్తుల్లో దాచుకుంటారు. కొందరు ప్యాకెట్‌లలో సిమెంట్, పౌడర్, గాజు అనే పేరుతో పంపిస్తారు. ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడకుండా ఉండటానికి కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. చెన్నై, ముంబై, కొచ్చి విమానాశ్రయాల్లో ఎక్కువ స్మగ్లింగ్ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3వేలకు పైగా గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులు నమోదయ్యాయి. 2.6 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది గత పది సంవత్సరాల్లో అది పెద్ద స్మగ్లింగ్ స్కామ్.

కస్టమ్స్ అధికారులు, డీఆర్‌ఐ బృందాలు ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. వాళ్లు ఎయిర్‌పోర్ట్‌ల్లో స్క్యానింగ్ చేస్తున్నారు. అనుమానాస్పద ప్రయాణికుల్ని చెక్ చేస్తున్నారు. స్నిఫర్ డాగ్స్ కూడా వాడుతున్నారు. అయినా స్మగ్లర్స్ కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. గోల్డ్ స్మగ్లర్స్‌ అంటే కేవలం ఒక్కరే కాదు. వాళ్ల వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. దేశం బయట ఉన్న వాళ్లు, దేశం లోపల ఉన్న డీలర్లు, మధ్యవర్తులు అందరూ కలసి పని చేస్తారు. బంగారం దేశంలోకి వచ్చిన వెంటనే అమ్మేస్తారు. పండుగ సీజన్‌లో అయితే గంటలలోనే విక్రయాలు పూర్తవుతాయి.

ఇటు ప్రజలు కూడా ఎప్పుడూ తక్కువ ధర ఎక్కడ ఉంటుందా అని చూస్తారు. అదే స్మగ్లర్స్‌కి అవకాశమవుతుంది. ఆ బంగారం చట్టబద్ధం కాదు అని ఎవరికీ తెలియదు. కానీ దాని వల్ల దేశానికి నష్టం. ప్రభుత్వానికి ట్యాక్స్ రాదు. చట్టబద్ధ వ్యాపారులు నష్టపోతారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ నమ్మకమైన దుకాణాల్లోనే బంగారం కొనాలి. తక్కువ ధర చూసి కొనడం ప్రమాదం. మనం ఒక ఇయర్ రింగ్‌ కొంటున్నామనుకున్నా, దాని వెనుక పెద్ద చీకటి వ్యాపారం ఉండవచ్చు. ఇక దీపావళి వెలుగుల మధ్య ఈ చీకటి వ్యాపారం కొనసాగుతోంది. కానీ మనం జాగ్రత్తగా ఉంటే, చట్టబద్ధ మార్గాల్లో కొనుగోలు చేస్తే, ఈ స్మగ్లింగ్‌ ఆగుతుంది. బంగారం కంటే విలువైనది నిజాయితీ. అదే మన దేశానికి నిజమైన వెలుగు.