Let's talk: editor@tmv.in
స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్‌ను అవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

స్పోర్ట్స్ హ్యాకథాన్ పోస్టర్‌ను అవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

క్రీడలు, సాంకేతికతను మేళవించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు తెలంగాణ వేదిక కాబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి స్టేడియం ఇన్నోవేషన్ లీగ్ 'స్పోర్ట్స్ హ్యాకథాన్®' అధికారిక లోగో, పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఘనంగా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ పూర్తి సహకారంతో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్, క్రీడారంగంలో గ్లోబల్ లీడర్‌గా రాష్ట్రాన్ని నిలబెట్టనుంది.

మార్చి 29న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరగనుంది. ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, 24 గంటల పాటు నిర్విరామంగా సాగే ఒక వినూత్న ప్రయోగం. ప్రొఫెషనల్ స్టేడియం వాతావరణంలో అటు క్రీడల్లో పాల్గొంటూనే, మరోవైపు క్రీడారంగానికి సంబంధించిన సమస్యలకు వినూత్న పరిష్కారాలను అన్వేషించడం దీని ప్రత్యేకత.

ఈ కార్యక్రమం నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తోంది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటీ శ్రీహరి మాట్లాడుతూ, ఈ హ్యాకథాన్ రాష్ట్ర యువతకు కొత్త అవకాశాల దారులు తెరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం వ్యవధి పాటు తాను స్వయంగా స్టేడియంలో ఉండి పాల్గొంటానని తెలిపారు. తెలంగాణను ప్రపంచ క్రీడా ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టే దిశగా ఇది కీలక అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. యువత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఇది నిలుస్తుందని ఆయన అన్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డుపై కన్ను

రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి యువత, క్రీడాకారులు, విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, విదేశీ పాల్గొనేవారిని ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఒకే స్టేడియంలో 10,000 మందికి పైగా పాల్గొనేలా లక్ష్యాన్ని నిర్దేశించగా, 2,000 కంటే ఎక్కువ ఆవిష్కరణల రూపకల్పన జరగనుంది. ఈ భారీ స్థాయి నిర్వహణ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ప్రత్యక్ష క్రీడా కార్యకలాపాలు, నిరంతర ఆవిష్కరణ ప్రక్రియను కలిపిన ఈ రూపకల్పన ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతుండటం విశేషం.

హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సుందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, క్రీడలు, సాంకేతికతను ఒకే వేదికపై సమన్వయం చేయడం హ్యాకథాన్‌ల అభివృద్ధిలో కొత్త దశను సూచిస్తుందని చెప్పారు. 24 గంటల పాటు నిరంతరంగా సాగే ఆవిష్కరణ ప్రక్రియలో పాల్గొనే వేలాది మంది యువత కలిసి పని చేయడం ద్వారా భవిష్యత్ క్రీడా రంగానికి వినూత్న పరిష్కారాలు సిద్ధమవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమం ప్రపంచ స్థాయి ప్రమాణాలను సృష్టించనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ వివరాలు

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం +91 8019077575 లేదా +91 8123123434 నంబర్లను సంప్రదించవచ్చు. క్రీడలు, సాంకేతికతపై ఆసక్తి ఉన్న యువతకు ఇదొక సువర్ణావకాశం.