
స్పీకర్ తొలగింపు తీర్మానంపై మార్చి 9న చర్చ: కిరన్ రిజిజు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తదుపరి ఓటింగ్‌ను మార్చి 9న లోక్‌సభ సమావేశమైన వెంటనే చేపడతామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజిజు మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాల రెండో దశ (మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు) ఆసక్తికరంగా ఉండబోతోందని, పలు కీలక బిల్లులు, ఒక అత్యంత ముఖ్యమైన బిల్లును చర్చించి ఆమోదించనున్నట్లు వెల్లడించారు. మేము కొన్ని ముఖ్యమైన బిల్లులు తీసుకొస్తాం. ఒక కీలక బిల్లును కూడా ప్రవేశపెడతాం. ప్రస్తుతం దాని వివరాలు వెల్లడించలేం. రెండో దశలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని తీసుకువస్తాం. అన్ని బిల్లులను ఆమోదింపజేస్తామని ఆయన తెలిపారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై బిల్లును ఈ దశలో ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు, ఆ అంశంపై పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇంకా ఖరారు కాలేదని, అందువల్ల నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ సంతకం చేయలేదని రిజిజు పేర్కొన్నారు. చిన్న పార్టీలలో చాలా మంది సభను అడ్డుకోవడానికి అనుకూలంగా లేరని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందు తమ సమస్యలను ప్రస్తావించాలనుకుంటున్నారని అన్నారు.
మార్చి 9న తొలి రోజే ఓటింగ్
మార్చి 9న లోక్‌సభలో స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. నిబంధనల ప్రకారం మొదటి రోజే దీనిని తీసుకుంటాం. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి సంయుక్త సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 12న విరామం ఇచ్చాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టింది. సమావేశాలు మార్చి 9న పునఃప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి.
ఐదు మంత్రిత్వ శాఖలపై చర్చ
రెండో దశలో ప్రభుత్వం కొన్ని మంత్రిత్వ శాఖలను చర్చకు ఎంపిక చేస్తుందని రిజిజు తెలిపారు. లోక్‌సభలో ఐదు మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చ ఉంటుంది. రాజ్యసభలో మరో ఐదు మంత్రిత్వ శాఖల పనితీరుపై చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం సభ నడవనివ్వకపోతే గిలోటిన్ విధానానికి వెళ్తాం. అది వారికి నష్టమే అని ఆయన హెచ్చరించారు.
ఎన్నికల నేపథ్యం
రెండో దశ బడ్జెట్ సమావేశాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నాయని మంత్రి గుర్తుచేశారు.
తొలి దశలో ఉద్రిక్తతలు
బడ్జెట్ సమావేశాల తొలి దశలో ఫిబ్రవరి 2 నుంచి లోక్‌సభలో అంతరాయాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం. నరవాణే ప్రచురించని స్మృతు(మోమోయర్) ల నుంచి 2020 భారత్–చైనా ఘర్షణకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం నెలకొంది. ఫిబ్రవరి 4న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వలేకపోయారు. ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానం వాయిస్ ఓట్‌తో ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ తీర్మానాన్ని చదివి ఆమోదింపజేశారు. తర్వాత స్పీకర్ బిర్లా, కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధానమంత్రి సీటు సమీపంలో అనూహ్య చర్యకు పాల్పడవచ్చని సమాచారం అందిందని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. సభలో అనుచిత ప్రవర్తన కారణంగా ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యులను బడ్జెట్ సమావేశాల మిగతా కాలానికి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా, ప్రతిపక్షం స్పీకర్‌పై పక్షపాతంగా వ్యవహరించారంటూ తొలగింపు తీర్మానం సమర్పించిన గంటల వ్యవధిలోనే బిర్లా తాను అవిశ్వాస తీర్మానం తేలే వరకు అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
