
స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ చట్టబద్ధం కాదు: జస్టిస్ యశ్వంత్ వర్మ
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తనపై ఉన్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీని సుప్రీంకోర్టులో బుధవారం సవాల్ చేశారు. జస్టిస్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, జడ్జెస్ (ఇంక్వైరీ) యాక్ట్, 1968, రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(5) నిబంధనలను ఉల్లంఘిస్తూ విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ఒకే రోజు లోక్‌సభ, రాజ్యసభల్లో ఇంపీచ్‌మెంట్ మోషన్(రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించేందుకు ప్రారంభించే చట్టపరమైన ప్రక్రియ)లు దాఖలైతే, రెండు సభలు కలిసి సంయుక్త విచారణ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో రాజ్యసభలో మోషన్ తిరస్కరించబడిన తర్వాత లోక్‌సభ స్పీకర్ ఏకపక్షంగా కమిటీ ఏర్పాటు చేశారని, అందువల్ల అది చట్టపరంగా చెల్లదని వాదించారు.
రాజ్యసభలో మోషన్‌ను ఉపాధ్యక్షుడు తిరస్కరించిన నిర్ణయాన్ని కూడా రోహత్గీ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఒక సభలో మోషన్ తిరస్కరణ జరిగితే మరో సభ విచారణ కొనసాగించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, రాజ్యసభ మోషన్ తిరస్కరణ జరిగినా లోక్‌సభ కమిటీ ఏర్పాటు చేయకుండా ఉండాలనే నిషేధం చట్టంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన రోహత్గీ, ఒకే రోజు రెండు సభల్లో మోషన్లు దాఖలైతే రెండూ ఆమోదంచెందితేనే తదుపరి ప్రక్రియ కొనసాగాలని, లేకపోతే మొత్తం ప్రక్రియ చెల్లదని వాదించారు.
కేసు నేపథ్యం
న్యూఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో 2025 మార్చి 14న కాలిన కరెన్సీ నోట్ల మూటలు లభించడంతో వివాదం మొదలైంది. ఆ తరువాత ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ముగ్గురు సభ్యులతో అంతర్గత విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మే 4న నివేదిక సమర్పించి, జస్టిస్ వర్మ దుర్వ్యవహారానికి పాల్పడ్డారని తేల్చింది.
జస్టిస్ వర్మ రాజీనామాకు నిరాకరించడంతో, ఆ నివేదికను ప్రధాని, రాష్ట్రపతికి పంపించి ఇంపీచ్‌మెంట్ ప్రక్రియకు మార్గం సుగమం చేశారు. అనంతరం, ఆగస్టు 12న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంపీచ్‌మెంట్ మోషన్‌ను ఆమోదించి ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ చర్యలు, మోషన్ ఆమోదం, విచారణ కమిటీ జారీ చేసిన అన్ని నోటీసులను రద్దు చేయాలని జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
