Let's talk: editor@tmv.in
స్పీకర్‌పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

స్పీకర్‌పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం

Pinjari Chand
11 ఫిబ్రవరి, 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతకం చేయలేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్‌ను తొలగించే అభ్యర్థనపై ప్రతిపక్ష నేత స్వయంగా సంతకం చేయడం సరికాదన్న సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, స్పీకర్ ఓం బిర్లాపై దాఖలైన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ కార్యదర్శి జనరల్‌ను స్పీకర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ మంగళవారం అధికారికంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని సమర్పించింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం నిబంధన 94సీ ప్రకారం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసును సమర్పించామని తెలిపారు. ఈ తీర్మానానికి మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పార్టీ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ ఏం చేయమంటే అది చేస్తామని ఆయన మీడియాతో అన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అవిశ్వాస తీర్మానం నోటీసు ప్రకారం, స్పీకర్ వ్యవహారం స్పష్టంగా పక్షపాతంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతిపక్ష నేతలకు సభలో మాట్లాడే అవకాశం నిరాకరించారని, ఇది రాజ్యాంగ ఆచారాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, జనరల్ ఎం.ఎం. నరవణే (రిటైర్డ్) ఇంకా ప్రచురితం కాని స్మృతిగ్రంథాన్ని(మోయోయర్) ఉటంకించిన సందర్భంలో సభాధ్యక్షుడి వైఖరి, ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఇవన్నీ అవిశ్వాస తీర్మానానికి కారణాలుగా నోటీసులో ప్రస్తావించారు. అలాగే, సభలో అనూహ్య ఘటన జరగొచ్చన్న సమాచారంతో ప్రధాని నరేంద్ర మోడీ సభకు రాకుండా తాను సూచించానని స్పీకర్ చేసిన వ్యాఖ్యను కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

మాణికం ఠాగూర్ మాట్లాడుతూ అసాధారణ పరిస్థితుల వల్లే ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్ పట్ల వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల గొంతును నిరంతరం అణిచివేయడంపై తీవ్ర ఆవేదన ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంలో భిన్న వైఖరి తీసుకుంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి ముందుగా ఆయనకు అప్పీల్ చేయాలని కాంగ్రెస్‌ను కోరినట్లు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు. రెండు మూడు రోజుల్లో స్పీకర్ స్పందించకపోతేనే తాము అవిశ్వాస తీర్మానానికి సంతకం చేస్తామని టీఎంసీ స్పష్టం చేసింది.

లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే ప్రయత్నం ఎప్పుడూ విజయవంతం కాలేదు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో, గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఒక్కటీ విజయవంతం కాలేదని పార్లమెంటరీ సంప్రదాయాలు స్పష్టం చేస్తున్నాయి. స్పీకర్ తొలగింపునకు కనీసం ఇద్దరు సభ్యుల సంతకాలతో నోటీసు అవసరం కాగా, సభ మొత్తం సభ్యుల సాధారణ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. నోటీసులో స్పష్టమైన ఆరోపణలు ఉండాలి. ఇప్పటివరకు ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో ఇలాంటి తీర్మానాలేవీ ఆమోదం పొందలేదని నిపుణులు చెబుతున్నారు.

నో-కాన్ఫిడెన్స్ నోటీసు పరిష్కారం అయ్యే వరకు సభకు హాజరుకాను: స్పీకర్ ఓం బిర్లా

తనపై దాఖలైన నో-కాన్ఫిడెన్స్ (అవిశ్వాస) నోటీసు పరిష్కారం అయ్యే వరకు నైతిక కారణాల దృష్ట్యా లోక్‌సభ సమావేశాలకు హాజరుకానని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై నో-కాన్ఫిడెన్స్ తీర్మానానికి నోటీసు సమర్పించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తనపై వచ్చిన నోటీసును సమీక్షించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను స్పీకర్ ఆదేశించినట్లు వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర కాంగ్రెస్ విశ్వసనీయతను ప్రశ్నించారు. తమిళనాడులోని ‘దీపం కేసు’లో ఒక న్యాయమూర్తిపై ఇంపీచ్‌మెంట్(తొలగించడం) ప్రయత్నం చేసిన గతాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

స్పీకర్‌పై నో-కాన్ఫిడెన్స్ తీర్మానం తెచ్చేంత అహంకారంతో కాంగ్రెస్ ఉంది. సభా నియమాలను పాటించకుండా, ఎవరి మీద నమ్మకం లేదని చెబుతున్నారు. దీనికి పార్లమెంట్ సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) ప్రకారం స్పీకర్‌పై నో-కాన్ఫిడెన్స్ నోటీసును సమర్పించాం. దీనిపై మొత్తం 118 మంది ఎంపీలు సంతకాలు చేశారని తెలిపారు. విపక్ష ఎంపీలు స్పీకర్ వ్యవహారం బహిరంగ పక్షపాతంగా ఉందని ఆరోపించారు. విపక్ష నేతలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, నాలుగు కీలక సంఘటనలను నోటీసులో ప్రస్తావించినట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నది ప్రధాన ఆరోపణగా పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీలు వెళ్లి ఉంటే లోక్‌సభలో అవమానకర దృశ్యాలు చోటుచేసుకునేవి: రిజిజు

లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనను బీజేపీ ఎంపీలు ఎదుర్కొనే అవకాశం ఇచ్చి ఉంటే సభలో అత్యంత అవమానకరమైన, అసహ్యకర దృశ్యాలు చోటుచేసుకునేవని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు హెచ్చరించారు. ఫిబ్రవరి 4న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాల్సిన రోజున ప్రతిపక్ష మహిళా ఎంపీలు ట్రెజరీ బెంచీల వైపు దూసుకెళ్లిన ఘటనపై ఆయన స్పందించారు. ఆ రోజు బీజేపీ మహిళా ఎంపీలు కాంగ్రెస్ సభ్యులను ఎదుర్కొనేందుకు ఆగ్రహంగా ఉన్నప్పటికీ, పార్టీ నేతృత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఎలాంటి గొడవ జరగకుండా ఆపామని రిజిజు తెలిపారు. సభ గౌరవం, పవిత్రతను కాపాడేందుకే తమ ఎంపీలను నియంత్రించామని చెప్పారు.